Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్.. కరోనాతో తెలంగాణలో తొలి మరణం

By:  Tupaki Desk   |   28 March 2020 1:48 PM GMT
బిగ్ బ్రేకింగ్.. కరోనాతో తెలంగాణలో తొలి మరణం
X
యావత్తు ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోనూ తనదైన శైలిలో విస్తరిస్తోంది. ఏపీలో ఈ వైరస్ వ్యాప్తి కాస్త నిదానంగానే ఉన్నా.. అంతర్జాతీయ సంబంధాల పరంగా కాస్తంత ముందుగా ఉన్న తెలంగాణలో ఈ వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుందనే చెప్పాలి. ఇప్పటిదాకా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వంద లోపే ఉన్నా... అనూహ్యంగా శనివారం రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకిన కారణంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన ఓ 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా ప్రకటించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే... ఖైరతాబాద్ కు చెందిన ఈ వృద్ధుడు... ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి వచ్చారట. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కాగా... ఆయనను సమీపంలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారట. అయితే సదరు అనారోగ్యం నుంచి కోలుకోలేక ఆయన శనివారం మరణించారు. అయితే సదరు వృద్ధుడు మరణించేదాకా ఆయనకు కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించని వైద్యులు.. ఆయన చనిపోయాక ఈ విషయంపై దృష్టి సారించారట. చనిపోయిన వృద్ధుడి రక్త నమూనాలను తీసి పరీక్షలు చేయగా... కరోనా పాజిటివ్ అని తేలిందట.

ఈ నేపథ్యంలో సదరు వృద్ధుడు కరోనా కారణంగానే మరణించాడని నిర్ధారించుకున్న గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు... విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి నివేదించారట. దీంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్న ఈటల.. పరిస్థితిపై అక్కడికక్కడే సమీక్షించి... కరోనా కారణంగా రాష్ట్రంలో నమోదైన తొలి మరణం ఇదేనని అధికారికంగా ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల కింద... చనిపోయిన వృద్ధుడి కుటుంబ సభ్యులను వైద్యులు క్వారంటైన్ కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే... కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో కాస్తంత స్పీడందుకుందనే చెప్పాలి. శనివారం ఒక్కరోజే కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 65కు చేరుకున్నట్లుగా ఈటల తెలిపారు.