టీటీడీలో మరో లొల్లి...

Tue Jun 02 2020 21:30:29 GMT+0530 (IST)

Another Issue In TTD

కారణాలు ఏవైనా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవల అనూహ్య రీతిలో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు టీటీడీ పాలకమండలి తీసుకుంటుండగా వాటిని వివిధ రాజకీయ పక్షాలు వివాదాలుగా మార్చుతున్నాయి. టీటీడీ విషయంలో సందర్భం ఏదైనా ముందుండటం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నించే బీజేపీ తాజాగా మరో అంశాన్ని తెరమీదకు తెచ్చింది. ఏకంగా ధర్నా నిర్వహించింది.టీటీడీకి చెందిన అధికారిక పత్రిక సప్తగిరిలో ప్రచురితం అయిన ఓ కథనం ఆధారంగా బీజేపీ విమర్శలు చేస్తోంది. తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థి పునీత్ సప్తగిరిలో ఓ కథ రాశారు. రాముడి జీవిత విశేషాలకు చెందిన రామాయణానికి అది భిన్నంగా ఉంది. రాముని సతీమణి అయిన సీత లవుడు మరియు కుశుడు అనే ఇద్దరు కవలలకు జన్మ ఇవ్వలేదని ఆ కథనంలో పేర్కొన్నారు. లవుడికి మాత్రమే సీత జన్మనిచ్చిందని కుశుడు ఓ గడ్డిబొమ్మ అని ఆ కథనంలో ప్రతీక్ విశ్లేషించాడు.

ఈ కథనంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి చెందిన ధార్మిక పత్రికలో ఇలాంటి కథనాలు రావడం దురదృష్టకరమని అన్నారు. రాముడిని ఆరాధించే ఎందరో మనోభావాలను ఈ కథనం దెబ్బతీసిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి అసత్యాలను ప్రచారంలో పెట్టే కథనాలకు టీటీడీ పత్రిక చోటివ్వవద్దని డిమాండ్ చేస్తూ వాల్మికి రాసిన రామాయణమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. కాగా ఈ విషయమై టీటీడీ స్పందించాల్సి ఉంది.