Begin typing your search above and press return to search.

పూలన్ దేవి ఊచకోత కేసులో నేడే తుది తీర్పు !

By:  Tupaki Desk   |   18 Jan 2020 7:20 AM GMT
పూలన్ దేవి ఊచకోత కేసులో నేడే తుది తీర్పు !
X
బందిపోటు రాణి ఫూలన్ దేవి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈమె ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. అప్పట్లో అగ్రవర్ణ కులాల వారిని తెగనరికి తన సత్తా ఏంటో చూపించింది. ఈమె పై ఉన్న ఒక కేసులో దాదాపుగా 39 ఏళ్ల తరువాత భీమాయ్ ఊచకోత ఘటనపై శనివారం తీర్పు వెలువడనుంది. ఒకవేళ కోర్ట్ ఆమె దోషి అని తేల్చినప్పటికీ కూడా ఫూలన్ దేవికి శిక్ష విధించాలంటే ఆమె బతికిలేదు. ఈ కేసులో సాక్షులు కూడా దాదాపుగా అందరూ మరణించారు. అసలు పూలన్ దేవి చేసిన ఆ ఘటన ఏంటి..? ఆ ఘటనపై - ఫూలన్‌ దేవికి ఉన్న సంబంధం ఏమిటి..?

ఫిబ్రవరి 14 - 1981వ సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్‌ లోని కాన్‌ పూర్ దేహత్ ప్రాంతంలోని భీమాయ్ గ్రామంలో ఠాకూర్ల ఊచకోత జరిగింది. మొత్తం 20 మంది ఠాకూర్లు హత్యకు గురయ్యారు. దీని వెనక బందిపోటు రాణి ఫూలన్ దేవి హస్తం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఫూలన్ దేవిపై అదే ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు బందిపోటు దొంగలు లాలా రామ్ - శ్రీరామ్‌ లు అత్యాచారం చేశారు. ఇందుకు ప్రతీకారంగా ఫూలన్ దేవీ వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.

84 గ్రామాల్లో నివసించే ఠాకూర్లను అంతమొందించేందుకు గాను సమాజంలో వెనకబడిన సామాజిక వర్గం ముఖ్యంగా మల్లా సామాజిక వర్గంకు చెందిన వారు అంతా ఏకమై అగ్రకులానికి చెందిన ఠాకూర్లపై ప్రతీకారచర్యలకు దిగారు. ఫూలన్ దేవిపై జరిగిన సామూహిక అత్యాచరంకు ప్రతీకారం తీర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు కోర్టుల్లో మగ్గిన ఈ కేసులో తీర్పు జనవరి 6వ తేదీన వెలువడాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాలతో శనివారానికి వాయిదా పడింది. ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 మందిలో 17 మంది చనిపోయారు. కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫూలన్ దేవి కూడా 2001లో హత్యకు గురైంది.

అప్పట్లో సంచలనం సృష్టించిన 20 ఠాకూర్ల హత్య - ఆ తరువాత రాజకీయరంగును పులుముకుంది. ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న వీపీ సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. ఊచకోత జరిగిన రెండేళ్ల తర్వాత అంటే 1983లో ఫూలన్ దేవి మధ్యప్రదేశ్ పోలీసులకు క్షమాభిక్ష పథకం కింద లొంగిపోయింది. దాదాపు 11 ఏళ్లు గ్వాలియర్ మరియు జబల్ పూర్ జైలులోనే జీవితం గడిపింది. ఆ తరువాత జైలు నుండి బయటకి వచ్చి రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2001 జూలై 26న ఢిల్లీలోని తన అధికారిక బంగ్లా ఎదుటే ఆమె శతృవులు కాల్చి చంపారు.