2024 ముందే వారందరిని దేశం నుంచి గెంటేస్తారట!

Thu Oct 10 2019 17:25:12 GMT+0530 (IST)

Before 2024 will Throw Out All Illegal Migrants Says Amit Shah

వివాదాల్ని తెర మీదకు తీసుకురావటానికి మోడీషాలు సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ప్రభుత్వ బండి సజావుగా నడవాలన్న కాంక్ష కంటే.. తాము సెట్ చేసుకున్న ఎజెండాకు తగినట్లుగా వ్యవహరిస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్ ను తెర మీదకు తీసుకురావటానికి ఏ మాత్రం సందేహించని తత్త్వం మోడీషాల సొంతం. ఇప్పటికే ఎన్ ఆసీ విషయంలో భిన్న వాదనలు బలంగా వినిపిస్తూ.. ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ.. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి కమ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటి వెంట సంచలన వ్యాఖ్యల్ని చేశారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో గెంటివేస్తామంటూ అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ప్రస్తుతం హర్యానా.. మహారాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాజకీయ దుమారాన్ని రేపేలా వ్యాఖ్యలు చేశారు.

హర్యానాలోని కథియాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన షా.. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయాలంటే ఎంతో ధైర్యం కావాలని.. అది ప్రధాని మోడీకి చాలానే ఉందన్నారు. 2024 నాటికి మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకువస్తామని.. అంతకు ముందే.. దేశంలో తిష్టవేసుకొని ఉండిపోయిన వారిని గెంటివేస్తామన్నారు.

70 ఏళ్లుగా అక్రమ వలసదారులు దేశ ప్రజలకు అందాల్సిన వాటిని అనుభవిస్తూ.. ధైర్యంగా బతుకుతున్నారని.. అలాంటివారిని దేశం నుంచి బయటకు పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నాుు. రానున్న రోజుల్లో అక్రమ వలసదారులు దేశంలో ఉండరని ఆయన స్పష్టం చేశారు. తాము తీసుకున్న ట్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370 నిర్వీర్యం లాంటి నిర్ణయాలన్ని దేశానికి మేలు చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.మరీ.. గెంటివేత వ్యాఖ్యలు కొత్త దుమారానికి కారణమవుతాయన్న మాట వినిపిస్తోంది.