వేసవి ఎఫెక్ట్: కోట్ల లీటర్ల బీర్లు తాగిన మద్యం ప్రియులు

Tue May 17 2022 13:00:52 GMT+0530 (IST)

Beer Sales in Summer Heat

ఈ ఎండాకాలం భీకరంగా ఉంది. ఎండలు దంచికొడుతున్నాయి..  ఓ రేంజ్లో భానుడి భగభగలున్నాయి. మద్యం అమ్మకాలు అదే స్తాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందాలనుకునే మద్యం ప్రియుల చాయిస్ బీర్ ల వైపే మరలుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్ ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.కేవలం ఈ ఏడాది మార్చి నెల నాటికి 6702 కోట్ల రూపాయల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం బీర్ల అమ్మకాలు 90 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చూపిస్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

2020-21 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా బీర్లే కాదు.. మద్యం అమ్మకాలు కూడా పెద్దగా జరగలేదు. దీనికి తోడు చల్లని ఉత్పత్తులు ద్రవ పదార్థాలు కూడా కరోనా భయంతో జనాలు తీసుకోలేదు. చల్లని ఉత్పత్తులు తీసుకుంటే కరోనా వచ్చే అవకాశం అవకాశం ఎక్కువగా ఉందన్న నిపుణుల సూచనలతో చాలా బీర్లు తాగడం తగ్గించడంతో గత రెండు సీజన్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరగలేదు.

ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడం.. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా జంట నగరాల పరిధితోపాటు రంగారెడ్డి జిల్లాలో వేల కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ జిల్లాల్లోనే తెగ తాగేశారు.

బీర్ల అమ్మకాల్లో తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఇక్కడ 1.15 కోట్ల లీటర్ల బీర్లు ఏరులై పారాయి. కేవలం ఒక్క మే నెలలోనే తెలంగాణ వ్యాప్తంగా 10.64 కోట్ల లీటర్ల బీరును తాగేశారు మద్యం ప్రియులు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఎవరికి వాళ్లు శీతల పానీయాలు మాల్ట్ పానీయాలు సేవిస్తుంటే మద్యం ప్రియులు మాత్రం బీర్ మా ఓటు అన్నట్లు తెగ తాగేస్తున్నారు.

ఈ దెబ్బకు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు బోలెడు ఆదాయం వచ్చింది. తెలంగాణలోని మద్యం ప్రియులు ఒక్క ఏడాదిలోనే ఆనష్టాన్ని భర్తీ చేశారు. రాష్ట్ర ఖజానాకు బీర్ పొంగించినట్టుగా ఆదాయాన్ని పెంచారు. దేశ వ్యాప్తంగా చూస్తే తెలంగాణలో అత్యధికంగా మద్యం అమ్మకాలు సాగాయి.