Begin typing your search above and press return to search.

వేటేస్తారనుకుంటే.. ఏకంగా కెప్టెన్ ను చేశారు.. బంగ్లా క్రికెట్లో వైచిత్రి

By:  Tupaki Desk   |   14 Aug 2022 12:30 PM GMT
వేటేస్తారనుకుంటే.. ఏకంగా కెప్టెన్ ను చేశారు.. బంగ్లా క్రికెట్లో వైచిత్రి
X
అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే బలమైన జట్టుగా ఎదుగుతోంది బంగ్లాదేశ్. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ముష్ఫికుర్ రహీం, షకిబుల్ హసన్, మొహ్మదుల్లా, లిటన్ దాస్ తదితర క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. తమ జట్టుకు చాలాసార్లు గొప్ప విజయాలు అందించారు. అందరిలోనూ షకిబుల్ హసన్ మరింత మెరుగైన ఆటగాడు. ఎడమ చేతివాటం స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్ తో షకిబ్ ప్రపంచ టాప్ ఆల్ రౌండర్ గా నిలిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన షకిబ్ పలుసార్లు మ్యాచ్ లను గెలిపించాడు. అలా భారత ప్రజలకూ సుపరిచితుడు. అయితే, షకిబ్ విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయి.

టాప్ ఫామ్ లో ఉండగా బుకీతో బుక్కయి..

2019 వన్డే ప్రపంచ కప్ లో షకిబుల్ హసన్ ప్రదర్శన మామాలుగా లేదు. ఓవైపు భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీలు సెంచరీలు కొడుతుంటే.. మరోవైపు షకిబుల్ సైతం దీటుగా పరుగులు సాధిస్తూ, వికెట్లు తీస్తూ అద్భుతంగా రాణించాడు. ఆ ఊపు చూస్తే ప్రపంచంలో మేటి ఆల్ రౌండర్ షకిబ్ అని ఎవరూ అనకుండా ఉండలేకపోయేవారు.

కేవలం ఆరు మ్యాచ్ ల్లోనే 476 పరుగులు చేయడమే కాక.. 10 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిపోయాడు. దీంతో షకిట్ ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ గా నిలిచిపోతాడనే విశ్లేషణలు వచ్చాయి. అయితే, ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజులకే.. భారత్‌కు చెందిన బుకీతో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో షకిబ్‌పై ఏడాదిపాటు ఐసీసీ నిషేధం విధించింది. అలా.. కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉండగా అత్యంత విలువైన ఏడాది కాలాన్ని షకిబ్ కోల్పోయాడు.

బెట్టింగ్ కంపెనీతో జట్టు కట్టి

ఇటీవల షకిబ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ బెట్టింగ్‌ కంపెనీతో అతడు ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విచారణకు సిద్ధమైంది. వివాదం ముదిరి తీవ్ర చర్యలకు దారితీసేలా కనిపించింది. దీంతో తాను బెట్‌విన్నర్‌ అనే న్యూస్‌తో జట్టు కట్టినట్లు షకిబ్ స్వయంగా పేర్కొన్నాడు.

దీనిపైనా వివాదం కొనసాగడంతో ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. బెట్ విన్నర్ విషయం ఐసీసీకి చేరి ఉంటే ఎలా ఉండేదో కాని.. అంతటితో సద్దుమణిగింది. కాగా, ఇటీవల బంగ్లాదేశ్.. వెస్టిండీస్, జింబాబ్వేలలో పర్యటించింది. జింబాబ్వే మీద టీ20 సిరీస్‌ సహా వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ కోల్పోయింది. జట్టు ప్రదర్శన కూడా సాదాసీదాగా మారిపోయింది.

అనూహ్యంగా కెప్టెన్

విదేశీ పర్యటనల్లో జట్టు వైఫల్యాలతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌ సహా టీ20 ప్రపంచకప్‌ పోటీలకు కెప్టెన్‌గా షకిబ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీ మార్పులు చేసింది. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. దీనికోసం 17మందితో కూడిన జట్టును బీసీబీ ప్రకటించింది. వచ్చే ఆసియా కప్‌లో మాత్రమే కాకుండా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ మధ్య ట్రైసిరీస్‌లోనూ టీమ్‌కు సారథిగా షకిబ్‌ వ్యవహరిస్తాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించకపోయినా సారథిగా మాత్రం షకిబ్‌ ఉంటాడని బీసీబీ వెల్లడించింది. ఆసియా కప్‌లో ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది.