Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: గార్డెన్ సిటీలో పూర్తి లాక్ డౌన్..ఎప్పటి నుంచంటే?

By:  Tupaki Desk   |   11 July 2020 6:25 PM GMT
బ్రేకింగ్: గార్డెన్ సిటీలో పూర్తి లాక్ డౌన్..ఎప్పటి నుంచంటే?
X
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల పద్నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈ నెల ఇరవైమూడో తేదీ తెల్లవారుజామున ఐదు గంటల వరకూ లాక్ డౌన్ అమల్లోకి ఉంటుందంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద ఎత్తున నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమోదు నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. నిత్యవసరాలైన పాలు.. కూరగాయలు.. పండ్లు.. మందులతో పాటు.. కిరాణా సామాన్లు లాంటి అత్యవసరమైన షాపుల్ని మాత్రం తెరిచి ఉంచుతారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలని కోరింది. లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేసేందుకు వీలుగా మహానగరాన్ని ఎనిమిది భాగాలుగా విభజించనున్నారు. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పనున్నారు. తమకు కేటాయించిన ప్రాంతాల్ని వారు స్వయంగా పర్యవేక్షించనున్నారు.

పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ.. లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరిగినా అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కానీ.. అనూహ్యంగా ఈ నెల 14 రాత్రి నుంచి లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోనే కాదు.. కేరళ రాష్ట్రంలో ఈ మధ్యన ఒక రోజులో ఎనభై కేసులు నమోదైన నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్రంలోనూ లాక్ డౌన్ విధిస్తారా? అన్న చర్చ మొదలైందని చెప్పక తప్పదు.