బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణ

Mon Aug 15 2022 17:01:53 GMT+0530 (IST)

Bandi Sanjay padayatra.. Clash of TRS and BJP

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  జనగాం జిల్లాలో పర్యటన సందర్భంగా ఈ పరిస్థితి నెలకొంది. దేవరప్పుల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరి.. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. బీజేపీకి నినాదాలు చేశారు.టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ ఫ్లెక్సీలు టీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. బీజేపీ కార్యకర్తల కార్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘర్షణలో టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ పై ఏకంగా రాళ్లతో దాడికి ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ తీరుపై సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ చేతకాని  సీపీ ఇంట్లో కూర్చోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీతో నేరుగా బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల తలలు పగులకొడుతానంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబులోంచి ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఉండేది 6 నెలలే అంటూ వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దేవరప్పులలో దాడి నేపథ్యంలో బండి సంజయ్ కు పోలీసుల సెక్యూరిటీని పెంచారు. అయితే దీన్ని బండి సంజయ్ తిరస్కరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోనే బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతంది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.