Begin typing your search above and press return to search.

బండికొక రూలు కవితకు ఒక రూలా ?

By:  Tupaki Desk   |   26 March 2023 3:13 PM GMT
బండికొక రూలు కవితకు ఒక రూలా ?
X
బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు ఒక రూలు, కల్వకుంట్ల కవితకు మరో రూలు ఉన్నట్లుంది. దర్యాప్తు సంస్ధలు విచారణకు రమ్మని పిలిచినపుడు వ్యక్తిగతంగా వెళ్ళాల్సిందే తప్ప ప్రతినిధులనో లేకపోతే లీగల్ బృందాన్నో పంపుతామంటే కుదరదు. కవిత విషయంలో జరిగిందిదే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొదటిసారి విచారణకు హాజరైన కవిత రెండోసారి లీగల్ టీమును పంపితే విచారణకు ఈడీ నిరాకరించింది. వ్యక్తిగతంగా విచారణకు రమ్మని తాము నోటీసులు ఇచ్చినపుడు కవిత హాజరుకావాల్సిందే అని ఈడీ స్పష్టంగా చెప్పింది.

సీన్ కట్ చేస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే బండి సంజయ్ తన లీగల్ టీములను పంపుతున్నట్లు కబురుచేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నాటకలోని బీదర్ కు వెళుతున్నట్లు బండి సమాచారం అందించారు. తనకు బదులుగా తన లీగల్ టీము విచారణకు హాజరవుతుందని చెప్పారు. మరి బండి సమాధానంతో సిట్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే కేంద్రప్రభుత్వం స్ధాయిలో దర్యాప్తు సంస్ధలు ఎలా పనిచేస్తాయో రాష్ట్రప్రభుత్వంలో దర్యాప్తు సంస్ధలు కూడా అలాగే పనిచేస్తాయి. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలకు ఎలాంటి అధికారాలు ఉంటాయో ఇంచుమించు రాష్ట్రప్రభుత్వం పరిధిలో పనిచేసే సీఐడీకి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. అవసరమైనపుడు కేసుల తీవ్రతను బట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను నియమిస్తుంది.

ఈ సిట్ కు కూడా దాదాపు ఇలాంటి అధికారాలే ఉంటాయి. అలాంటిది విచారణకు రమ్మంటే రాకుండా లీగల్ టీమును పంపుతానని బండి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కవితను విచారణకు హాజరవ్వాల్సిందే అని ఈడీ ఎంతగా పట్టుబట్టిందో అందరికీ తెలిసిందే.

మరి బండి మాత్రం మినహాయింపు కోసం ప్రయత్నం చేయటం ఏమిటి ? ఈడీ దర్యాప్తుకు కవిత హాజరుకావాల్సిందే అని బండి నానా రచ్చచేశారు. అలాంటిది విచారణకు రమ్మని సిట్ నోటీసులు ఇస్తే తాను మాత్రం హాజరుకాకుండా తప్పించుకుంటున్న బండిని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి.