Begin typing your search above and press return to search.

బావలిద్దరినీ కలిపే పనిలో... ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 4:30 PM GMT
బావలిద్దరినీ కలిపే పనిలో... ?
X
వచ్చే ఎన్నికలు అలాంటి ఇలాంటివి కావు అని ముందే హింట్ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో ఈసారి ఆషామాషీగా ఎన్నికలు జరుగుతాయని ఎవరైనా అనుకుంటే పొరబాటే అంటున్నారు ఆయన. దాంతో అన్ని రకాలైన అవకాశాలను కూడగట్టుకుని మరీ బాబు గారు బరిలోకి దిగుతారు అన్నది వాస్తవం. ఇక పొత్తుల ఎత్తులలో చంద్రబాబు ఉంటే బావమరిది కమ్ వియ్యంకుడు బాలయ్య కూడా తనదైన శైలిలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

నిజానికి బాలయ్య సీరియస్ గా సినిమాలు చేసుకుంటున్నారు కదా మళ్లీ ఈ పాలిటిక్స్ ఏంటి అన్న డౌట్లు రావచ్చు. ఆయన రాజకీయాల మీద అలా ఒక లుక్కు వేస్తున్నారు. అయితే అది అప్పుడప్పుడు మాత్రమేనని ఇతర పక్షాలు విమర్శలు చేస్తూంటాయి. ఇదిలా ఉండగా బాలయ్య ఈసారి సంక్రాంతికి రూట్ మార్చారు. ఎపుడూ ఆయన చిన్న బావ చంద్రబాబుతో నారావారి పల్లెలోనే సంక్రాంతి వేడుకల్లో పాలు పంచుకుంటారు.

కానీ ఈసారి మాత్రం ఆయన బండి కారంచేడు వైపుగా మళ్ళింది. అది పెద్ద బావ, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సొంతూరు. అక్కడే బాలయ్య మూడు రోజుల పాటు సందడి చేశారు. సంక్రాంతి పండుగను కూడా యమ జోష్ గా జరుపుకున్నారు. అయితే ఈసారి బాలయ్య ఇలా టూర్ టర్నింగ్ ఇచ్చుకోవడం వెనక కేవలం ఫ్యామిలీ హుషారేనా లేక పాలిటిక్స్ కూడా ఉందా అన్న చర్చ కూడా వస్తోంది.

టీడీపీకి ఇపుడున్న పరిస్థితుల్లో అందరి సాయం కావాలి. దాంతో దగ్గుబాటి బావను టీడీపీ వైపుగా మళ్ళించేందుకే బాలయ్య ఈ టూర్ ప్లాన్ చేశారా అన్న చర్చ కూడా వస్తోందిట. నిజానికి దగ్గుబాటి చంద్రబాబు ఈ మధ్య నందమూరి వారింట జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనాడే ఇద్దరూ కలసిన ఫోటోలు, మాట్లాడుకున్న చిత్రాలు బయటకు వచ్చాయి. అది కూడా దాదాపుగా పాతికేళ్ల తరువాత జరిగిన ముచ్చట.

దాంతో ఇద్దరు తోడళ్ళుళ్ళూ కలిసిపోతున్నారు అన్న టాక్ కూడా బాగా వచ్చింది. అయితే ఆ తరువాత మాత్రం చడీ చప్పుడూ ఏమీ లేదు. మరి ఇపుడు బాలయ్య నేరుగా కారంచేడులో ల్యాండ్ కావడంతో పాటు పెద్ద బావ ఇంట్లో సందడి చేయడంతో బావమరిది ఇద్దరు బావలను మళ్ళీ కలిపే పనిలో పడ్డారా అన్న మాట కూడా గట్టిగా వినిపిస్తోంది. నిజానికి దగ్గుబాటి ఫ్యామిలీ చాలా కాలంగా ఇతర పార్టీల్లోనే ఉంది.

దగ్గుబాటి టీడీపీని వదిలేశాక బీజేపీ, కాంగ్రెస్, వైసీపీల వైపు సాగి ప్రస్తుతం విరామం ప్రకటించారు. ఇక పురంధేశ్వరి అయితే కాంగ్రెస్ లో చేరారు, ఆ మీదట బీజేపీలో చేరి ప్రస్తుతం అక్కడే కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయంగా చూస్తే బీజేపీ టీడీపీల మధ్య ఉప్పూ నిప్పులా సీన్ ఉంది. మరో వైపు చూసుకుంటే దగ్గుబాటి రాజకీయాలను వదిలేశారు. అయితే దగ్గుబాటి దంపతులకు తమ కుమారుడిని రాజకీయాల్లో చూసుకోవాలని కోరిక ఉంది.

దాంతోనే వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారని అంటారు. ఆ తరువాత పరుచూరి నుంచి ఆయన ఓడిపోవడంతో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇపుడు కొడుకు కోసమైనా వారు టీడీపీ వైపు వస్తారు అంటున్నారు. అయితే వయా మీడియాగా బాలయ్య కలుపుతారా అన్న చర్చ కూడా ఉంది. బాలయ్యకు అయితే తమ కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని, ఒకే పార్టీగా అది తన తండ్రి ఎన్టీయార్ స్థాపించిన టీడీపీలో ఉండాలని కోరిక ఉంది. అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు రాజీపడి తనే టీడీపీలో వారి ఫ్యామిలీ రాక జరిగే సీన్ ఉంది.

ఇక టీడీపీకి చూస్తే ఏపీలో పూర్వంగా దూకుడు లేదు. దాంతో అంతా కలసి ఒక పట్టుపడితే పార్టీకి పూర్వం రోజులు వస్తాయని అంతా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి దగ్గుబాటి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ కలిస్తే మాత్రం టీడీపీకి కొత్త జోష్ రావడం ఖాయం. ఆ పనిని బాలయ్య చేపట్టారా అన్న చర్చ ఉందిపుడు. మరి రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఏంటో. చూడాల్సి ఉంది.