Begin typing your search above and press return to search.

బాబా రాందేవ్ యూటర్న్: డాక్టర్లు దేవదూతలట

By:  Tupaki Desk   |   10 Jun 2021 1:30 PM GMT
బాబా రాందేవ్ యూటర్న్: డాక్టర్లు దేవదూతలట
X
అల్లోపతిపైనా, డాక్టర్లపైన సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురువు బాబా రాందేవ్ యూటర్న్ తీసుకున్నారు. కేసులు, ఫిర్యాదులు, కొందరు కోర్టుకెక్కడంతో దెబ్బకు దిగివచ్చాడు. ‘వైద్యులు దేవుడి దూతల్లాంటి వారంటూ’ తాజాగా పేర్కొన్నారు.

ఇక తన పోరాటం వైద్యులపై కాదని.. మాదక ద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ రాందేవ్ బాబు ప్రకటించారు. అంతేకాదు వ్యాక్సిన్ శుద్ధ వేస్ట్ అని..టీకాలు వేసుకున్న వారు వేల మంది చనిపోయారన్న రాందేవ్ బాబు.. తాజాగా మాటమార్చాడు. త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించాడు.

ఇక అంతర్జాతీయ యోగి దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు.శస్త్ర చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని రాందేవ్ బాబా చెప్పారు. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని.. తన పోరాటం డ్రగ్ మాఫియాపై మాత్రమేనని రాందేవ్ పేర్కొన్నారు.

అయితే ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందని రాందేవ్ బాబా తెలిపారు. మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపిడీ చేయవద్దని హితవు పలికారు.

ప్రతీ పౌరుడికి ఉచిత టీకా ప్రకటించి మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని రాందేవ్ బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరారు.