Begin typing your search above and press return to search.

వైసీపీకి బీఆర్ఎస్ మద్దతు.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   30 Jan 2023 7:20 PM GMT
వైసీపీకి బీఆర్ఎస్ మద్దతు.. ఏం జరుగుతోంది?
X
బీజేపీపై కోపంతో బీఆర్ఎస్ పెట్టారు కేసీఆర్. ఇక బీజేపీకి జాన్ జిగ్రీ దోస్తులా వైసీపీ ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది.. అందుకే తెలంగాణలో ఏం చేసినా జగన్ ను పిలవడం లేదు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి వెళుతూ అన్ని రాష్ట్రాల సీఎంలను పిలిచి పక్కనే ఉన్న ఏపీ సీఎంను పక్కనపెట్టారు. అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయని బీఆర్ఎస్, వైసీపీ శ్రేణులు చెప్పుకుంటాయి.

ఇక ఏపీలోనూ బీఆర్ఎస్ ను కేసీఆర్ విస్తరించారు. త్వరలో విశాఖలో భారీ సభ ఏర్పాటు చేసి ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతున్న ఏపీ అధికార పార్టీ మద్దతు కోరుతారా? లేదా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్రం ఏర్పాటు చేసే అఖిలపక్ష భేటిలో వైసీపీతోపాటు బీఆర్ఎస్ కూడా పాల్గొంది. వైసీపీ తరుఫున విజయసాయిరెడ్డి తమ పార్టీ డిమాండ్లను వినిపించారు. ఈ డిమాండ్ కు బీఆర్ఎస్ తోపాటు బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్ మద్దతు పలకడం విశేషం. ముఖ్యంగా జగన్ పార్టీకి కేసీఆర్ పార్టీ మద్దతు హైలెట్ గా నిలిచింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వైసీపీ డిమాండ్ కు బీఆర్ఎస్ ఎంపీల మద్దతు తెలుపడం విశేషం. దీంతోపాటు మరో రెండు పార్టీలు మద్దతు ఇవ్వడంతో కేంద్రం తగు చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది.

సామాజిక, ఆర్థిక స్థితగతులతో కులగణన చేయాలని వైసీపీ మరో డిమాండ్ కూడా వినిపించింది. బీసీల సామాజిక , ఆర్థిక డేటా ఆధారంగా ఆయా కులాలకు రిజర్వేషన్లు, సంక్షేమ ఫలాలు అందించవచ్చని వైసీపీ తెలిపింది. అలాగే రైతు సమస్యలను ప్రస్తావించినట్లు వైసీపీ ఎంపీ తెలిపారు.

ఇలా జాతీయ స్థాయిలోనూ వైసీపీకి మద్దతుగా బీఆర్ఎస్ నిలుస్తోంది. మరి ఈ కలయిక ఎటు దారితీస్తుందన్నది వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.