రాజకీయాలు పైకి కనిపించేలా ఉండడం లేదు. ఒక్కోసారి నాయకులు సొంత పార్టీ కాకుండా ప్రత్యర్థి పార్టీలు గెలిస్తే బాగున్ను అని కోరుకుంటున్నారు. అందుకు లోకల్ పాలిటిక్స్ ఒక కారణమైతే.. అభివృద్ధి పనులు నిధుల లెక్కలు కూడా మరో కారణమవుతున్నాయి. తెలంగాణలో పాలక బీఆర్ఎస్కు విపక్ష బీజేపీకి ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.
కానీ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే అధికారంలోకి రావాలని... కానీ కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలవాలని కోరుకుంటున్నారట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు ఆయా ఎమ్మెల్యేల అనుచరులు.
ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క హుజూరాబాద్ తప్ప మిగతా ఆరు చోట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ ఏడో నియోజకవర్గమైన హుజూరాబాద్ కూడా 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీయే గెలిచినా అక్కడ గెలిచిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఇప్పుడు బీజేపీ పరమైంది.
ఏ లోక్ సభ నియోజకవర్గంలోనైనా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్టీ గెలిస్తే లోక్ సభ ఫలితం వేరే పార్టీకి అనుకూలంగా రావడం చాలా అరుదు. కానీ కరీంనగర్లో మాత్రం ఆర్నెళ్లలోనే పరిస్థితి మారింది. 2019లో లోక్ సభ ఎన్నికలు జరగ్గా బీజేపీ నుంచి బండి గెలిచారు. సంజయ్ బీఆర్ఎస్ పెద్దలపై నిత్యం ఎన్ని విమర్శలు చేస్తున్నా కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనపై పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ. ఒకరిద్దరు మినహా బండి సంజయ్ విషయంలో అగ్రెసివ్గా ఉండరు.
పైగా అక్కడి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చే లోక్ సభ ఎన్నికలలోనూ బీజేపీ నుంచి బండి సంజయే గెలవాలని కోరుకుంటున్నారట. సంజయ్ అక్కడ నుంచి ఎంపీగా ఉంటే బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ అక్కడ ఉంటుందని తమ అసెంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులుకు అడగకుండానే నిధులు ఇస్తున్నారని చెప్తున్నారు. మామూలుగా అయితే నిధుల కోసం పనుల కోసం పార్టీ పెద్దల వద్దకు వెళ్లాలని అదంత సులభం కాదని.. కానీ ఇప్పుడు పెద్దగా ప్రయాస లేకుండానే నిధులు దొరుకుతున్నాయంటున్నారు. అదంతా సంజయ్ కారణంగానేనని.. అందుకే ఆయనే మళ్లీ గెలవాలని కోరుకుంటున్నారట.
బీజేపీ నాయకులు శ్రేణులు తారసపడినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఓపెన్గానే ఈ మాట చెప్తున్నారట. మీవాడు గెలిస్తేనే మాకు పార్టీలో ప్రయారిటీ అంటూ బహిరంగంగానే అంటున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.