అయ్యో: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని విషాదం

Sat Apr 01 2023 14:04:58 GMT+0530 (India Standard Time)

An unexpected tragedy in the BRS spiritual gathering

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీకవిత.. విచారణ నుంచి విరామం లభించిన నేపథ్యంలో ఈ మధ్యన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) ఆమె బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం జగిత్యాలకు బయలుదేరారు. అయితే.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో విషాదం నెలకొంది.ఆత్మీయసమ్మేళనంలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన  వేడుకల్లో భాగంగా నృత్యం  చేస్తున్న బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ కుప్పకూలిపోయారు.

దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు.. గులాబీ నేత మరణించినట్లు తెలపటంతో బీఆర్ఎస్ నేతలు విషాదంలో మునిగిపోయారు.

మరికాసేపట్లో భారీ ఎత్తున జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ వేడుకల్ని నిర్వహించే నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డాన్సులు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారు రజని భర్త నరేందర్ కూడా ఉత్సాహంతో డాన్సు వేశారు. ఉన్నట్లుండి తీవ్ర  అస్వస్థతకు గురైన ఆయన కుప్పకూలిపోవటం.. కాసేపటికే ప్రాణాలు పోయిన వైనంతో పార్టీ వర్గాలు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

దీంతో.. ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు. బండారు నరేందర్ మృతి విషయం తెలిసినంతనే ఎమ్మెల్సీ కవిత తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఉదంతం బీఆర్ఎస్ వర్గాలను విషాదంలో మునిగేలా చేసింది. పార్టీ కార్యక్రమ వేదిక వద్ద నరేందర్ భౌతిక కాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.