ఈశాన్య రాష్ట్రాల్లో పోటీకి బీఆర్ఎస్ రెడీ.. ప్రభావం ఎంత?

Mon Jan 23 2023 12:45:50 GMT+0530 (India Standard Time)

BRS is Ready to Compete in North Eastern States

భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు మెల్లగా పావులు కదుపుతోంది. తమకు వస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని పార్టీకి జాతీయ హోదా కల్పించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈశాన్యంకు చెందిన మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆ రాష్ట్రాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతోంది. తాజాగా నాగాలాండ్ కు చెందిన ఓ ప్రముఖ నేత హైదరాబాద్ లో కనిపించారు. బీఆర్ఎస్ నాయకులను కలిసి తమకు ఆర్థిక సాయం చేస్తే బీఆర్ ఎస్ తరుపున పోటీ చేయడానికి రెడీ అన్నట్లు సంకేతాలు ఇచ్చారు.కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు తెచ్చుకున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు జాతీయ హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 1968 కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం.. ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఆయా ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. ఈశాన్య రాష్ట్రాలు చిన్నవి ఉంటాయి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఓటుశాతం సాధించడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడున్న ఓటర్లను ఆకట్టుకొని తమ పార్టీకి మలుచుకునే విధంగా ప్రయత్నిస్తే పెద్ద కష్టమేమీ కాదని బీఆర్ఎస్ అనుకుంటోంది.

అయితే ఇటీవల నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోథా కలిశారు. తనకు బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పిస్తే తన పార్టీని విలీనం చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈయన బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయ ప్రారంభానికి కూడా హాజరయ్యారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆయన గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు త్రిపురకు చెందిన కొంతమంది నేతలను బీఆర్ఎస్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. గతంలో కమ్యూనిస్టు కోటాగా పేరున్న ఈ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన వామపక్షాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మేఘాలయలో క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు. ఆ కోణంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోయినా ఓటుశాతం రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఓటు శాతం సాధిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత పట్టుగా మిగతా రాష్ట్రాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలను సంప్రదించిన బీఆర్ఎస్ ప్రతినిధులు త్వరలో మరింత మందిని కలిసి పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేఘాలయలో బీజేపీకి పట్టు బాగుంది.

నాగాలాండ్ కూడా బీజేపీ నేతలకే పట్టం కడుతున్నారు. త్రిపురలో సంకీర్ణం ద్వారా బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రాల్లో ఓటుబ్యాంకుసాధిస్తే బీజేపీకి ప్రత్యామ్నారం తామేనని చెప్పనున్నారు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.