Begin typing your search above and press return to search.

తెలంగాణ భవన్ లో తొలిసారి ధిక్కర సన్నివేశం.. మీకు ఇప్పుడు గర్తుకొచ్చామా?

By:  Tupaki Desk   |   22 March 2023 2:00 PM GMT
తెలంగాణ భవన్ లో తొలిసారి ధిక్కర సన్నివేశం.. మీకు ఇప్పుడు గర్తుకొచ్చామా?
X
అది అలాంటి ఇలాంటి భవన్ కాదు.. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన తెలంగాణ భవన్. పూర్వ టీఆర్ఎస్.. తాజా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం. అలాంటి చోట.. పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన సన్నివేశం తాజాగా ఆవిష్క్రతమైంది. పార్టీ సర్వసభ్య సమావేశంలో అధినాయకత్వంపై అసంతృప్తిని బయటకు కక్కేశారు. గతంలో ఇలాంటి సన్నివేశం ఎప్పుడూ ఎదురు కాలేదని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ క్యాడర్ సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తమ మనసుల్లోని భావాల్ని వెల్లడించేందుకు ఏ మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ వెనుకాడలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చామా? అని సూటిగా ప్రశ్నించటమే కాదు.. పార్టీని నమ్ముకున్న వారికి ఏం న్యాయం చేశారు? మీకు పదవులు.. మాకు గుర్తింపే లేదు. హైదరాబాద్ లో మజ్లిస్ కార్యకర్తలకు ఉన్నంత గుర్తింపు అధికార పార్టీకి చెందిన తమకు మాత్రం లేకుండా పోయిందని వాపోయాడు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా నిలిచిన వారికి ఎలాంటి పదవులు.. గుర్తింపు దక్కలేదని.. పార్టీలోకి దిగుమతి అయిన వారే పదవుల్లో ఉన్నారన్న విషయాన్ని వెల్లడించారు.

బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఎదురైన పరిణామాల్ని తాము పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళతామని నేతలు నచ్చజెప్పాల్సిన వచ్చింది. హాట్ హాట్ గా సాగిన ఈ సమావేశం.. తెలంగాణ భవన్ హిస్టరీలో ఇంతకు ముందెప్పుడు చోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వెల్లడించిన వారి ఆవేదనను చూస్తే..

- ఉద్యమకాలం నుంచి జెండాలు మోశాం. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం. రాష్ట్రం వచ్చాక మీకు అధికార పదవులొచ్చాయి. మాకు మాత్రం కనీస గుర్తింపు లేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మేం ఇప్పుడు గుర్తుకు వచ్చామా?

- పార్టీని నమ్మకున్న కింది స్థాయి నాయకులు.. కార్యకర్తలకు ఏం న్యాయం చేశారు. సీనియర్లకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. పార్టీ కోసం తమ రక్తం ధార పోసినోళ్లకు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పార్టీలో ఉన్నామని చెప్పుకోవటం మినహా ఒరిగిందేమీ లేదు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు.

- గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎంఐఎం నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యం బీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌కు ఇవ్వడం లేదు. పార్టీలో కొందరికే న్యాయం జరుగుతోందని, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.

బీఆర్ఎస్ నేతలకు.. ఉద్యమంలో పని చేసిన పలువురు తమ గుండెల్లో ఉన్న అసంతృప్తిని ఇంతకాలం ఎప్పుడూ బయటపెట్టింది లేదు. ఏ స్థాయి సమావేశంలోనూ ఇలాంటి ఆగ్రహాన్ని చూసింది లేదని.. ఇది తొలిధిక్కార స్వరంగా పలువురు అభివర్ణిస్తున్నారు. అంచనాలకు మించిన ఆగ్రహం సభలో బయట పడిన నేపథ్యంలో.. పార్టీనేతలు.. కార్యకర్తల ఆవేదనను ముఖ్యమంత్రి కమ్ పార్టీఅధినేత కేసీఆర్ ముందుకు తీసుకెళతామని.. తగిన నిర్ణయిం తీసుకుంటామని చెప్పి సముదాయించారు. ఇదంతా చేయటానికి బీఆర్ఎస్ ముఖ్యనేతలకు తల ప్రాణం తోకకు వచ్చినట్లుగా తమ అంతర్గత సంభాషణల్లో పేర్కొనటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.