Begin typing your search above and press return to search.

బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి..!

By:  Tupaki Desk   |   9 Jun 2023 7:06 PM GMT
బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి..!
X
ప్రస్తుత కాలం లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, పాటించే జీవన శైలి ఇలా కారణం ఏదైనా రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. వాటి లో బీపీ, షుగర్లు చాప కింద నీరు లా దేశం లో పాకుతున్నాయి. వయసు తో సంబంధం లేకుండా అందరూ బీపీ, షుగర్ సమస్యల బారిన పడుతున్నట్లు గుర్తించారు. తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

దేశం లో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నట్లు ఆ సర్వే లో తేలడం గమనార్హం. ఇక బీపీ( రక్త పోటు) తో బాధపడుతున్నవారు అయితే 35.5 శాతం మంది ఉన్నట్లు సర్వే లో తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి మద్రాస్ డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం చేయగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

2008-2020 మధ్య దేశ వ్యాప్తంగా 1.1 లక్షల మంది పై ఈ సర్వే చేశారు. అందరికీ ఒకే విధంగా కాకుండా, ఒక్కో రాష్ట్రాన్ని డివైడ్ చేసి, ఆ రాష్ట్రం లోని పరిస్థితుల కు, సామాజిక, ఆర్థిక పరిస్థితుల ను అన్నీ పరిశీలించి వాటికి అనుగుణంగా వారు ఈ పరిశోధన చేశారు. వివిధ రకాల సమస్యల ను దృష్టి లో ఉంచుకొని, వారి ఆరోగ్య పరిస్థితుల ను అంచనా వేశారు. అయితే, ఎక్కువ మంది బీపీ, షుగర్ లతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ రెండు జబ్బులు చాలా మంది లో కామన్ గా మారిపోయాయి. ప్రజలు వాటికి అలవాటు పడిపోయారు.

ఈ రెండు మాత్రమే కాదు, దేశం లో దాదాపు 15.3 శాతం మంది ప్రీ డయాబెటిక్ తో బాధపడుతున్నారట. మరో 28శాతం మంది ప్రజలు ఒబేసిటీ అంటే అధిక బరువు సమస్య తో బాధపడుతున్నారు. ఇక 39.5 శాతం మంది పొట్ట సంబంధిత సమస్యల తో బాధపడుతున్నట్లు గుర్తించారు.

అయితే, ఈ విషయం లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య అని, దానిని నిర్వహించడానికి జీవనశైలి లో మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ ని కంట్రోల్ చేసుకోవడాని కి సరైన జీవన శైలి, మంచి ఆహారం, వ్యాయామం లాంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని, లేకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.