Begin typing your search above and press return to search.

విదేశీ గడ్డపై రాహుల్ వ్యాఖ్యల వేళ.. ఆయనపై వేటుకు ఛాన్సు ఎంత?

By:  Tupaki Desk   |   18 March 2023 9:53 AM GMT
విదేశీ గడ్డపై రాహుల్ వ్యాఖ్యల వేళ.. ఆయనపై వేటుకు ఛాన్సు ఎంత?
X
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? ఆయనపై చర్యల వేటుకు అవకాశం ఉందా? మోడీ సర్కారుకు మంట పుట్టేలా ఆయన మాటలు ఉన్నాయా? నిజంగానే ఆయన తప్పుగా మాట్లాడారా? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అప్పట్లో మరేం జరిగింది? ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలీ వివాదం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

ఇటీవల కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. విదేశీ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోడీ సర్కారుపై ఘాటు విమర్శలు చేయటంతో పాటు భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్న తీవ్ర వ్యాఖ్య చేశారు. పలు విమర్శలు చేశారు. తనను లోక్ సభలో మాట్లాడనివ్వకుండా మోడీ సర్కారు నొక్కేస్తుందంటూ మండిపడ్డారు.

రాహుల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. అంత మాత్రన విదేశీ గడ్డ మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారా? అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కమలనాథుల నోటి నుంచి ఎక్కువ అవుతోంది. ఇలాంటివేళ.. రాహుల్ నిజంగానే తప్పు చేశారా? ఇప్పుడు రాహుల్ చేసినట్లే గతంలో ఎవరైనా చేశారా? అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాటికి ఎలా రియాక్టు అయ్యాయి? లాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.

గతంలో ఏం జరిగింది?

ఇప్పుడు రాహుల్ మాదిరే.. గతంలోనూ ఎవరైనా నేత ఇలాంటి తీరును ప్రదర్శించారా? విదేశీ గడ్డ మీదకు వెళ్లి.. భారత ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారా? ఒకవేళ అలా చేస్తే.. అలాంటి వారి విషయంలో అప్పటి ప్రభుత్వాలుచేపట్టిన చర్యలు ఏమిటి? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి చరిత్రలోకి వెళితే.. ఒక ఉదంతం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటి బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో విదేశీ గడ్డపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. విదేశీ వేదికలపై అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి.

అప్పుడేం జరిగింది?

విదేశీ వేదికలపై అప్పట్లో సుబ్రమణ్యస్వామి దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారన్న వాదన బలంగా వినిపించింది. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో అత్యయిక పరిస్థితిని విధించిన వేళ.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా.. బ్రిటన్..కెనడాల్లోని రేడియోల్లోనూ.. ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై గళం విప్పారు. ప్రధాని ఇందిరను హత్య చేస్తారంటూ విదేశీల్లో స్వామి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కాంగ్రెస్. అక్కడితో వదలకుండా అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయనపై పార్లమెంటరీ దర్యాప్తు కమిటీ వేశారు. అనంతరం ఆయన్ను సభ నుంచి బహిష్కరించారు.

ఇప్పుడు రాహుల్ విషయంలోనూ అదే తీరా?

ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పట్లో స్వామి మీద వేటు వేసినప్పుడు లేని ఇబ్బంది తాజాగా రాహుల్ మీద వేటు వేస్తే మాత్రం ఏమవుతుంది? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే.. స్వామిపై వేటు వేసిన వేళ.. ఇందిర ప్రభుత్వంపై ఏ తరహాలో విమర్శలు వెల్లువెత్తాయో.. ఇప్పుడు మోడీ సర్కారు అలాంటి పరిస్థితే ఎదుర్కొవాల్సి ఉంటుందంటున్నారు. అంతే కాదు.. చర్యలు తీసుకోనంతవరకు ఒకలాంటి పరిస్థితి ఉంటుందని.. రాహుల్ మీద నిజంగానే చర్యలు తీసుకుంటే ఆయనపై సానుభూతి పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది.నిజంగానే రాహుల్ అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారా? అంటే లేదనే చెప్పాలి. ప్రజాస్వామ్య భారత్ గొప్పతనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండటం. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడతారు. వారి మాటలకు ప్రజలు తీర్పు ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉన్నప్పుడు.. రాహుల్ లాంటి ముఖ్యనేతపై కత్తి దూయయటం ఆయనకే కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి.. మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.