వెంకయ్యకు టాటా.. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్

Sat Jul 02 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

BJP vice president Amarinder Singh

బీజేపీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలందరినీ పద్ధతి ప్రకారం సైడ్ చేసేసిన మోడీ షాలు.. ఇప్పుడు తెలుగు వ్యక్తి.. ఒకప్పుడు బీజేపీని మోసిన వెంకయ్యను కూడా శాశ్వతంగా పక్కకు తప్పించేయడానికి రంగం సిద్ధం చేశారు. ఒకసారి భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు అవకాశం ఇచ్చారు. ఆయన కేంద్రమంత్రిగా అత్యంత యాక్టివ్ గా ఉంటే.. తమను డామినేట్ చేస్తాడని గ్రహించి.. ఉత్సవ విగ్రహమైన 'ఉపరాష్ట్రపతి' పదవికి నామినేట్ చేసి పంపించేశారు.



గడిచిన ఐదేళ్లుగా ఉపరాష్ట్రపతిగా ఉంటున్న వెంకయ్యకు మళ్లీ రెన్యూవల్ చేసే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. వెంకయ్యకు టాటా చెప్పేసి కొత్తగా కెప్టెన్ ను ఉపరాష్ట్రపతిని చేయడానికి బీజేపీ నిర్ణయించేసింది.  ఒడిషాకు చెందిన ద్రౌపదిని గిరిజన కోటాలో రాష్ట్రపతిని చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఉత్తరాది నుంచి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ఉపరాష్ట్రపతిగా చేయబోతున్నట్టు టాక్.

అమరీందర్ కాంగ్రెస్ తరుఫున సీఎంగా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి పోటీచేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఆయనకు ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేసేందుకు బీజేపీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అమరీందర్ సింగ్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లారు. గత ఆదివారం ఆపరేషన్ పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ.. కెప్టెన్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. లండన్ నుంచి తిరిగివచ్చాక కెప్టెన్ అమరీందర్ 'పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్ సీ) పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు నిన్న పలు మీడియా చానళ్లలో కథనాలు వచ్చాయి. అమరీందర్ తో బీజేపీ మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం.  విలీనం అనంతరం కెప్టెన్ నే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.

దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన అమరీందర్ సింగ్.. గత ఏడాది కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చారు. పంజాబ్ సీఎం పదవిని వదలుకొని ఎన్నికల ముందు కొత్త పార్టీని పెట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఓడిపోయారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన వేళ ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నారు. జులై 5 నుంచి 17వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 10తో వెంకయ్య పదవీకాలం ముగియనుండడంతో ఇక ఆయన రాజకీయాలనుంచి రిటైర్ అయినట్టే. ఇప్పటికే అద్వానీ జోషి ఉమాభారతి మేనకాగాంధీ లాంటి ఎంతో మంది సీనియర్లను ఇంటికి పంపిన మోడీ షాలు నెక్ట్స్ వెంకయ్యనే సాగనంపనున్నారని సమాచారం.