Begin typing your search above and press return to search.

ప‌టేల్ ఓట్ల కోస‌మే.. బీజేపీ ప‌న్నిన వ్యూహం!

By:  Tupaki Desk   |   12 Sep 2021 12:50 PM GMT
ప‌టేల్ ఓట్ల కోస‌మే.. బీజేపీ ప‌న్నిన వ్యూహం!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రుపానీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఒక్క‌సారిగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ‌చ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ చ‌ర్యతో రాష్ట్ర రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. రాష్ట్ర అభివృద్ధి కోస‌మే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు రుపానీ బ‌య‌ట‌కు చెప్పినా.. ఆయ‌న ప‌నితీరుపై బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉంద‌ని అందుకే త‌ప్పుకోవాల‌ని సూచించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆ రాష్ట్రంలో కీల‌కంగా ఉన్న పాటీదార్ (ప‌టేల్‌) సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డం కోస‌మే బీజేపీ ఈ వ్యూహానికి తెర‌తీసింద‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గుజ‌రాత్‌లో ప‌టేల్‌లు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా కొన‌సాగుతున్నారు. ఉత్త‌ర గుజ‌రాత్‌, సౌరాష్ట్రలో ఈ వ‌ర్గం ఎక్కువ‌గా ఉంటుంది. రాష్ట్ర జ‌నాభాలో దాదాపు 14 శాతం వీళ్లే ఉన్నారు. అంటే సుమారు 1.5 నుంచి 2 కోట్ల వ‌ర‌కూ వీళ్ల జ‌న‌భా ఉంటుంద‌ని అంచ‌నా. దీంతో రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాల‌కు గాను 70కి పైగా స్థానాల్లో వీళ్లు ప్రభావం చూప‌గ‌ల‌ర‌ని స‌మాచారం. వీళ్ల మ‌ద్ద‌తుతోనే బీజేపీ రెండు ద‌శాబ్దాలుగా గుజ‌రాత్‌లో అధికారంలో కొన‌సాగుతోంది. కానీ 2015లో రిజ‌ర్వేష‌న్ల కోటా కోసం ఈ వ‌ర్గం ఆందోళ‌న ప్రారంభించింది. ఓబీసీల్లో క‌లిపి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌నే డిమాండ్‌తో పాటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి పేరుతో యువ నాయ‌కుడు హార్దిక్ ప‌టేల్ నాయ‌క‌త్వంలో ఆందోళ‌న జ‌రిగింది. 5 ల‌క్ష‌ల మందికి పైగా ప‌టేల్ వ‌ర్గం ప్ర‌జ‌లు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హార్దిక్‌ను అరెస్టు చేయ‌డంతో గుజ‌రాత్ అట్టుడికిపోయింది. ప‌టేల్ డిమాండ్‌కు త‌లొగ్గిన ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో దాన్ని తీర్చ‌లేన‌ప్ప‌టికీ పాటిదార్ స‌హా ఉన్న‌ల కులాల్లోని పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించింది.

ఈ ఆందోళ‌న ప్ర‌భావం 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ బీజేపీపై గ‌ట్టిగానే ప‌డింది. 99 సీట్లు మాత్ర‌మే గెలిచిన బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌టు చేయ‌గ‌లిగిన‌ప్ప‌టికీ గుజ‌రాత్ చ‌రిత్ర‌లో ఆ పార్టీ సాధించిన అతి త‌క్కువ సీట్లు ఇవే. 2012 ఎన్నిక‌ల్లో 115 స్థానాల్లో గెలిచిన పార్టీ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ఓటు షేరు ప‌డిపోయింది. అదే స‌మయంలో కాంగ్రెస్ ఓటు షేరు పెర‌గ‌డం విశేషం. అందుకు కార‌ణం ఈ ప‌టేల్ సామాజిక వ‌ర్గ‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అంతే కాకుండా హార్దిక్ ఇప్పుడు కాంగ్రెస్‌లో కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌కు యువ‌త ఆద‌ర‌ణ ఉంది. ద‌ళిత నేత జిగ్నేశ్ మేవానీ కూడా కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాలంటే ప‌టేల్ వ‌ర్గం మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని బీజేపీ గుర్తించింది. అందుకే విజ‌య్‌ను ప‌దవి నుంచి త‌ప్పించేలా చేసింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

విజ‌య్ రూపానీ జైన్ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో పాటిదార్లు ఆయ‌న సీఎం కావ‌డంపై అసంతృప్తి వ్యక్తం చేశార‌ని తెలిసింది. దీంతో పాటు త‌మ సామాజిక వ‌ర్గానికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కాల‌ని ప‌టేల్ నాయ‌కులు అనుకుంటున్నారు. ఇప్ప‌టి నుంచే ఆ దిశ‌గా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకే బీజేపీ కూడా ఆ దిశ‌గా దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు గుజ‌రాత్ మంత్రివ‌ర్గంలో ఆరుగురు పాటిదార్ నాయ‌కుల‌కు చోటు క‌ల్పించింది. ఇటీవ‌ల కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ గుజ‌రాత్‌కు అధిక ప్రాధాన్యం ద‌క్కింది. ప‌టేల్ వ‌ర్గానికి చెందిన మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌క ఆరోగ్య శాఖ బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డంతో పాటు మ‌రో నేత పురుషోత్తం రూపాలాను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంది. ఇప్పుడిక వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిలక‌ల నేప‌థ్యంలో ప‌టేల్ వ‌ర్గం నేత‌కే రాష్ట్ర ప‌గ్గాలు అప్ప‌జెప్పాల‌ని భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డిలో వైఫ‌ల్యం జ‌నాక‌ర్ష‌ణ లేద‌నే కార‌ణాల‌తో విజ‌య్‌ను గ‌ద్దె దించిన‌ట్లు చెప్తున్న‌ప్ప‌టికీ దాని వెనక దాగి ఉన్న వ్యూహం మాత్రం ప‌టేల్ వ‌ర్గానికి చేరువ కావ‌డ‌మే.

తన వ్యూహంలో భాగంగానే గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభా పక్షం ఈరోజు సమావేశమై భూపేంద్ర పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మ‌రి ఈ వ్యూహంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం నిల‌బెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ కోరిక తీరుతుందా అన్న‌ది చూడాలి.