రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న బీజేపీ నేతలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఉత్తరాంధ్రలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి.. పీవీఎన్ మాధవ్ ఘోర పరాజయం పాలయ్యారు. నిజానికి కాలికి బలపం కట్టుకుని.. ఆయన తన సొంత నిధులు కూడా ఖర్చు పెట్టుకుని.. ఇక్కడ ప్రచారం చేశారు.
కేంద్రం నుంచి వస్తున్న నిధులతో విశాఖను అభివృద్ది చేస్తున్నారని.. కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలన తోనే ఏపీ సుభిక్షంగా ఉందని కూడా.. మాధవ్ సహా.. పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు కూడా ప్రకటించారు. అయితే.. మాధవ్ మాత్రం పట్టుమని 12 వేల ఓట్లు కూడా దక్కించుకోలేక పోయారు. దీంతో ఆయన చేసిన డిపాజిట్ సొమ్ము కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు దీనికి కారణాలపై అంతర్మథనం ప్రారంభమైంది.
మాధవ్.. రాష్ట్ర స్థాయిలో అంతో ఇంతో బలమైన గళం వినిపిస్తున్న బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకు న్నారు. అలాంటి నాయకుడు కూడా బీజేపీకి లేకుండా పోవడం వెనుక.. ఏం జరిగింది? అని ఆలోచన చేస్తే.. పార్టీలో మాధవ్ గెలుపు బాధ్యతలను అందరికీ పంచాల్సిన సోము వీర్రాజు.. ఎవరినీ.. అక్కడకు రానివ్వకుం డా.. కేంద్రం నుంచి చక్రం తిప్పారనే వాదన ఆది నుంచి వినిపించింది. అంతా తనే అయి నడిపించారు.
దీంతో ఇతర నేతలు.. అంటే.. పురందేశ్వరికానీ సీఎం రమేష్ సుజనా చౌదరి వంటివారు సహా కామినేని శ్రీనివాస్ కూడా రాలేదు. పైగా మాధవ్పై సోము గ్రూపు మనిషి అనే పేరు కూడా ఉంది. దీంతో ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. ఇంకోవైపు.. జనసేనతో పొత్తు ఉందని చెప్పుకొన్నారే తప్ప.. పవన్ను కలిసి. మద్దతు కోరింది లేదు. ఆయన కూడా ముందుకు వచ్చి బీజేపీ అభ్యర్థి మాధవ్ను గెలిపించాలని కోరింది కూడా లేదు. మొత్తం.. ఈ పరిణామాలను గమనిస్తే.. సోము చేసిన వైఫల్యాలే కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.