Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్స్ పై బీజేపీ నేతల అతితెలివి

By:  Tupaki Desk   |   30 July 2021 6:39 AM GMT
విశాఖ స్టీల్స్ పై బీజేపీ నేతల అతితెలివి
X
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ నేతలు అతి తెలివి చూపుతున్నారు. బీజేపీ ఎంఎల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరించటం లేదన్నారు. కేవలం పెట్టుబడులు మాత్రమే ఉపసంహరించుకుంటోందని చావు కబురు చల్లగా చెప్పారు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు అశ్వత్ధాతమ హతః అని గట్టిగా అరిచి చెప్పి కుంజరహ అని మెల్లిగా అన్నట్లుగా ఉంది మాధవ్ చెప్పింది.

ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటం లేదు కానీ పెట్టుబడులను మాత్రం ఉపసంహరించేస్తోంది అని చెప్పటంలో మాధవ్ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావటంలేదు. జనాలను ఎంఎల్సీ పిచ్చోళ్ళని అనుకుంటున్నాడో ఏమిటో. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి భూమిని ఇవ్వటం తప్ప రాష్ట్రప్రభుత్వానికి మరే పాత్రలేదు. ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న నిధులన్నీ కేంద్రానివే. తన నిధులను కేంద్రం నూరుశాతం వెనక్కు తీసేసుకుంటుంటే ఇక అందులో మిగిలేదేముంది ?

తన నిధులను కేంద్రం ఉపసంహరించుకుంటే ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది ? ఈ ప్రశ్నకు మాధవ్ సమాధానం చెప్పటంలేదు. ఇక్కడే బీజేపీ నేతల అతితెలివి బయటపడుతోంది. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించటమన్నా, తన నిధులను కేంద్రం ఉపసంహరించుకోవటమన్నా ఒకటే. తాము ఏమి మాట్లాడుతున్నాము ? ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసుకోలేనంత అమయాకులు ప్రజలని మాధవ్ అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్వయంగా కేంద్రమంత్రులే పార్లమెంటులో ప్రకటించారు. ఇదే విషయాన్ని కేంద్రప్రభుత్వం సుప్రింకోర్టు అఫిడవిట్లో కూడా స్పష్టంగా చెప్పేసింది. కేంద్రమే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేస్తామని చెబుతుంటే మధ్యలో లోకల్ బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటో అర్ధం కావటంలేదు. ప్రైవేటీకరణ విషయంలో సోము వీర్రాజు కానీ మాధవ్ కానీ ఎంత సమర్ధించుకున్నా ఉపయోగం లేదు. జనాలు తమకన్నా తెలివైన వాళ్ళన్న విషయం కమలనాదులు మరచిపోయినట్లున్నారు. ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం వైఖిరికి జనాలు బీజేపీని ఎలా సత్కరించాలో అంతా సత్కరిస్తారనటంలో సందేహంలేదు.

ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునేంత సీన్ రాష్ట్రంలోని బీజేపీ నేతలకు లేదు. అలాగని కేంద్రం చర్యలను సమర్ధించేంత ధైర్యమూలేదు. అందుకనే ఇలా నోటికొచ్చినట్లుగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఒకవైపు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు బిడ్డింగులను ఆహ్వానించామని స్వయంగా కేంద్రమంత్రే పార్లమెంటులో ప్రకటించారు. మరి దీనికి మాధవ్ ఏమని సమాధానం చెబుతారు ? కాబట్టి జరిగేదాన్ని ఆపలేనపుడు జరిగేదాన్ని చూస్తూ ఉండటమే మంచిది. అంతేకానీ నోటికొచ్చినట్లు మాట్లాడి జనాల్లో పలుచనవ్వటం అవసరమా ?