Begin typing your search above and press return to search.

తెలంగాణలో రూట్ ఛేంజ్ చేసిన బీజేపీ

By:  Tupaki Desk   |   29 Jan 2023 6:00 PM GMT
తెలంగాణలో రూట్ ఛేంజ్ చేసిన బీజేపీ
X
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ రూట్ ఛేంజ్ చేసింది. ఇప్పటి వరకు పాదయాత్రల ద్వారా ముందుకు సాగిన ఆ పార్టీ నాయకులు ఇక నుంచి రథయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. రథ యాత్రల కోసం 5 బస్సులను సిద్ధం చేశారు. ఇందులో ఒక దానిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తారు. మిగిలిన నాలుగు బస్సులను పార్లమెంటరీ వారీగా ప్రాంతాలను విభజించి ఆ ప్రాంతాల్లో తిప్పుతారు. వీటిని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే ఆరుణ లాంటి నేతలకు కేటాయించనున్నారు. బీజేపీ బలంగా లేని చోట్ల వీరు పర్యటించి పార్టీ ప్రతిష్టతను పెంచనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ యాత్రలు పూర్తయ్యేలా ఇప్పటికే ప్లాన్ రెడీ చేశారు. అయితే ఎన్నికల సమయానికి అవసరమైతే పార్లమెంట్ నియోజకవర్గానికో రథం కేటాయించనున్నట్లు బీజేపీ వ్యూహం పన్నుతోంది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల గడువు మాత్రమే ఉంది. ఆలోపు ఈ యాత్రలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాదయాత్రల ద్వారా గ్రామ గ్రామాన బీజేపీకి బలం పెరుగుతోంది. కానీ అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేయడం సాధ్యం కాదు. అందువల్ల రథయాత్రలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంతో పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ చేసిన తప్పులు.. బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి అందరికీ వివరించే వీలు కలుగుతుందని ఆలోచిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివిధ మార్గాల ద్వారా తెలంగాణకు భారీగా నిధులు కేటాయించింది. కానీ బీఆర్ఎస్ తన బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిధులు ఇస్తోంది..? దానిని బీఆర్ఎస్ ఏ విధంగా మరల్చుకుంటోందో రథయాత్రల్లో ప్రజలకు వివరించనున్నారు. రథయాత్రలకు పెద్దగా జనాన్ని సేకరించాల్సిన అవసరం లేదు. నాయకులే జనం వద్దకు వెళ్లొచ్చు. వారికి నేరుగా పార్టీ గురించి చెప్పొచ్చు. అందుకే బీజేపీ రథయాత్రల కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం రథాల సంఖ్య 5కు పరిమితం చేశారు. ఈ యాత్రలు సక్సెస్ అయితే వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే పార్లమెంటుకో రథాన్ని తిప్పనున్నారు. దీంతో మారుమూల గ్రామాల్లో సైతం బీజేపీని తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నేతల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా ముందుగా ముఖ్య నేతలకు రథాలను కేటాయిస్తారు. ఆ తరవాత అవసరమైన చోట పార్లమెంట్ స్థాయిలో ఉన్న నేతలకు రథాన్నికేటాయించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ నిర్వహించే ఈ రథయాత్రల ద్వారా ప్రజలు ఎలా ఆకర్షితులవుతారో చూడాలి.