పవన్ కి గట్టి ఝలక్ ఇచ్చిన బీజేపీ...?

Wed Mar 29 2023 20:55:02 GMT+0530 (India Standard Time)

BJP gave a hard competition to Pawan...?

కమలం పార్టీ కదా నోటా కాంటే తక్కువ ఓట్లు వచ్చాయి కదా అని లైట్ తీసుకుంటే మేము కూడా అంతే అని అంటోందా ఏపీ బీజేపీ. ఆ పార్టీకి ఓట్లు తక్కువ రావచ్చేమో కానీ జాతీయ పార్టీగా దర్జా దర్పం చాలా హెచ్చు. అందుకే ఏపీలో జనసేనను జూనియర్ పార్టనర్ గా చేసుకోవాలనుకుంది. కానీ జనసేన మాత్రం ససేమిరా అనడమే కాదు దూరం జరిగింది.పేరుకు పైకి కనిపించడానికి మిత్రులు తప్ప నిజంగా ఏమీ కాదు అని లేటెస్ట్ గా జరిగిన పట్టభద్రుల ఎన్నికలతో తేలిపోయింది. దాంతో బీజేపీ కూడా ఇక ఏమీ దాచుకోదలచుకోలేదేమో. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన పార్టీ మీటింగులో జనసేన మద్దతు తమకు దక్కలేదని నేతలు రుసరుసలు ఆడారు. ఇపుడు చూస్తే మరింత ఓపెన్ అయినట్లుగా బీజేపీ వైఖరి ఉంది.

టోటల్ గా ఏపీలో మొత్తం 175 సీట్లకు గానూ 163 సీట్లకు బీజేపీ తన పార్టీ నుంచి కన్వీనర్లను కో కన్వీనర్లను ప్రకటించింది. వీరే రేపటి ఎన్నికల్లో అభ్యర్ధులు అని ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తోంది. అంటే 163ని బీజేపీ ప్రకటించిందని లెక్క తీసుకుంటే జస్ట్ 12 నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయన్న మాట.  రేపో మాపో వాటికి కూడా కన్వీనర్లను పార్టీ ప్రకటించేట్టుగానే ఉంది. ఆ ఊపు చూస్తూంటే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు.

మొత్తానికి బీజేపీ పొమ్మకనే పొగ పెడుతోందా మిత్రుడు అని చెప్పుకున్న జనసేనకు ఈ విధంగా ఝలక్ ఇస్తోందా అన్న చర్చ సాగుతోంది. ఎక్కడైనా మిత్రపక్షం అన్నపుడు ఇద్దరూ కూర్చుని తమ అభ్యర్ధులను ఎంచుకుంటారు. ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఆ ఆనవాయితీ లేదనే అంటున్నారు. ఏపీలో మూడు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అన్నింటా బీజేపీయే పోటీ చేసింది. జనసేనకు మిత్రుడిగా కనీసం ఒక్క సీటు అయినా పోటీ చేయ్ అని చెప్పలేదని అంటారు.

ఇపుడు చూస్తే కన్వీనర్లు సడెన్ గా ప్రకటించడం వెనక ఇక పొత్తు చిత్తు అని చెప్పడమే అని అంటున్నారు. అలా పరోక్షంగా మాకేమి పొత్తులు లేవు సంబంధం అంతకంటే లేదు అని బీజేపీ సందేశం ఇస్తోందా అన్నదే చూడాలని అంటున్నారు. చాలా కాలంగా జనసేన నేతలు బీజేపీ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో సైతం వైసీపీని ఓడించండి అన్నారు తప్ప బీజేపీకి ఓటేయండి అని జనసేన పిలుపు ఇవ్వలేదు.

దాంతోనే కమలం పెద్దలకు మండిపోతోంది అని అంటున్నారు. ఇలా రెండు పార్టీలు పొత్తులను పెటాకులు చేసుకునేందుకే సిద్ధపడుతున్నారు కానీ ఎవరు ముందు చెబుతారా అన్నదే మ్యాటర్. ఇది కూడా వ్యూహమే. బీజేపీ పొత్తుకి కటీఫ్ అని చెబితే తన తప్పేమి లేదని అంతా వారే చేశారని చెప్పుకోవాలని జనసేన నేతలు చూస్తున్నారు. అయితే బీజేపీ అలా చెప్పకుండా జనసేన నోటి వెంటనే ఆ మాట వచ్చేలా చేయాలని చూస్తోంది.

అందుకే మొన్న జనసేన మీద విమర్శలు చేసిన ఏపీ బీజేపీ పెద్దలు ఈ రోజు కన్వీనర్లను ప్రకటించారు. రేపటి రోజున మరింత ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక విధంగా ఏపీలో తమది ఒంటరి పోరు అన్నట్లుగానే బీజేపీ భావిస్తోందని ఆ దిశగా డిసైడ్ అయిపోయిందని అందుకే కన్వీనర్లను నియమిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అంటోంది. ఆ సంగతేంటి అంటే అది కూడా బీజేపీ ఆలోచనల్లో ఉంటే ఉండొచ్చు అంతున్నారు.

కన్వీనర్లను ముందు నియమించడం ద్వారా ఒకవేళ పొత్తు కుదిరితే  బలమైన చోట్ల పోటీకి టికెట్లు అడగవచ్చు అని బీజేపీ లెక్కలు అని అంటున్నారు. మొత్తానికి పవన్ విషయంలో మాత్రం బీజేపీ ఒక క్లారిటీకి వచ్చిందనే అంటున్నారు. ఇదిలా ఉండగా కన్వీనర్లు నియమించిన బీజేపీ రానున్న రోజుల్లో గ్రామ స్థాయి వరకూ బూత్ లెవెల్ వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెబుతోంది.

బీజేపీని పటిష్టం చేయడం ద్వారా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగినా లేక ముందే జరిగినా తగినట్లుగా సిద్ధపడాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. అంతే కాదు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా త్వరలో ఆందోళనలు చేపట్టబోతున్నట్లుగా బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చెబుతున్నారు. చూడాలి మరి బీజేపీ తాత్పర్యం జనసేనకు ఎంత వరకూ అర్ధమైందో. ఏపీలో పరిణామాలు ఎలా మారుతాయో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.