Begin typing your search above and press return to search.

వైసీపీపై బీజేపీ మాజీ ఎంఎల్ ఏ జోస్యం!!

By:  Tupaki Desk   |   18 Nov 2020 1:50 PM GMT
వైసీపీపై బీజేపీ మాజీ ఎంఎల్ ఏ జోస్యం!!
X
మూడేళ్ళ తర్వాత వైసీపీ మనుగడలో ఉండదని బీజేపీ మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని బల్లగుద్ది మరీ చెప్పారు. దాంతో పార్టీని మూసేయటం ఖాయమని కూడా తేల్చి చెప్పేశారు. తాను కేఏ పాల్ మాదిరిగా నోటికొచ్చినట్లు మాట్లాడటం లేదని కచ్చితమైన విశ్లేషణతోనే ఈ మాటలు చెబుతున్నట్లు రాజుగారు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. తాను చెబుతున్న మాటలపై తనకే అనుమనం వచ్చినట్లుంది. అందుకనే కేఏ పాల్ ప్రస్తావన తెచ్చారు.

మడమ తిప్పను, మాట తప్పనని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చేసి, మడమ తిప్పేసినట్లు ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ విషయాన్నే మరచిపోయినట్లు మండిపడ్డారు. పైగా నిర్మాణాలు పూర్తయిన ఇళ్ళను కూడా లబ్దిదారులకు ఇవ్వటం లేదంటూ ధ్వజమెత్తారు. పాదయాత్ర సందర్భంగా జగన్ చెప్పిన మాటలు నమ్మి ఎందుకు ఓట్లేశామా అని జనాలు ఇపుడు బాధపడుతున్నట్లు రాజు చెప్పారు.

జగన్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని కూడా మాజీ ఎంఎల్ఏ వివరించారు. పొరబాటున ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే వాళ్ళపై కక్షసాధింపులకు దిగుతున్నట్లు రాజు తీవ్రంగా మండిపడ్డారు. శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు విశాఖ నగరంలోని జనాలంతా భయపడిపోతున్నారట. శుక్రవారం రాత్రి మొదలుపెట్టి సోమవారం ఉదయం వరకు ఇళ్ళను కూల్చేస్తోంది ప్రభుత్వం అంటు రెచ్చిపోయారు. అందుకనే శని - ఆదివారాలు కూడా కోర్టులు పనిచేస్తే బాధితులు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారట.

అంతా బాగానే ఉంది కానీ ప్రభుత్వం ఎవరి ఇళ్ళను కూల్చేస్తోంది కూడా రాజు చెబితే బాగుండేది. ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకున్న సబ్బం హరి లాంటి వాళ్ళపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగే ప్రభుత్వ స్ధలాన్ని కబ్జా చేసి భవనాలు నిర్మించేసుకున్న గీతం కళాశాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది కానీ పేదల జోలికి వెళ్ళలేదు. మరి ఈ విషయం మాజీ ఎంఎల్ఏకి తెలీదా ? సరే ప్రతిపక్షమన్న తర్వాత ప్రతిపక్షంగానే వ్యవహరించాలి. కాబట్టి రాజు చెప్పిన మాటలు నిజమవుతాయా లేదా చూడాలంటే మరో మూడున్నరేళ్ళు వెయిట్ చేయాల్సిందే.