ఏపీ బీజేపీలో కొత్త వ్యూహం.. నిలబడేనా?

Wed Jul 21 2021 17:00:01 GMT+0530 (IST)

BJP New Strategy In Andhrapradesh

ఏపీ బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. సాధారణంగా ఏ పార్టీ అయినా.. ప్రజల్లోకి నేరుగా వెళ్లడమో.. లేక.. ఉద్యమాల ద్వారా ప్రజలను తమవైపు తిప్పుకోవడమో.. మనం చూస్తాం. కానీ దీనికి భిన్నంగా.. బీజేపీ వ్యవహరిస్తోంది. వైసీపీ సర్కారులోని మంత్రులను టార్గెట్ చేస్తోంది. మంత్రులను అవినీతి పరులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోందనే వాదన వస్తోంది.అంటే.. తద్వా రా.. మంత్రుల అవినీతి ప్రజల్లో చర్చకు దారితీసి.. బీజేపీ నేతలకు గుర్తింపు వస్తుందనేది ఏపీ కమల నాధుల వ్యూహంగా ఉంది. ఇటీవలే ఒక మంత్రికి .. ఒక అధికారి మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని నిర్మించి ఇచ్చారని.. ఏకంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బాంబు పేల్చారు.

అయితే.. దీనికి పెద్దగా సంచలనం రాకపోయినా.. ఎవరూ పట్టించుకోకపోయినా.. మంత్రి కొడాలి నాని మాత్రం తగుదునమ్మా.. అంటూ.. మీడియా ముందుకు వచ్చి....తనకు దానికి సంబంధం లేదన్నారు. దీంతో అప్పటి వరకు.. ఈ విషయంపై పెద్దగా లేని విశ్లేషణలు తర్వాత పుంజుకున్నాయి.

ఇక బీజేపీ నేతలు దీనినే కొరుకున్నారు. తాము ఆరోపించడం.. మంత్రులు స్పందించ డం.. వెంటనే దీనికి మీడియాలో గుర్తింపు రావడమే వారికి కావాల్సింది. ఇక గతంలోనూ కర్నూలుకు చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడిపైనా.. టీడీపీ నేతలు.. తొలుత అవినీతి ఆరోపణలు చేశారు.

జయరాం కుమారుడికి.. ఎవరో కారు లంచంగా ఇచ్చారంటూ.. టీడీపీ నేతలు ఆరోపించగానే.. బీజేపీ నేతలు సైతం దీనిని అంది పుచ్చుకున్నారు. అప్పట్లోనూ ఈ విషయం రచ్చకు దారితీసింది. అయితే.. ఆ తర్వాత ఇది సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజే మంత్రుల విషయాన్ని పట్టుకుని రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.

త్వరలోనే మరో మంత్రి బాగోతాన్ని కూడా బయట పెడతామని అంటున్నారు. అయితే.. గుమ్మనూరు విషయాన్ని పక్కన పెడితే.. మూడు కోట్ల ఇంటిని లంచంగా పుచ్చుకున్న మంత్రి విషయాన్ని సోము ఇతమిత్థంగా చెప్పకపోవడం గమనార్హం. రాజకీయాల్లో విమర్శలు కామనే అయినా..ఇలాంటి.. గట్టి విమర్శలు చేసినప్పుడు.. ఆధారాలు లేకపోతే.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మున్ముందు కూడా మంత్రుల విషయాన్ని లోతుగా పరిశీలిస్తామని చెబుతున్న బీజేపీ వ్యూహం బాగానేఉన్నా.. ఏమేరకు నిలబడతారనేది ఆసక్తిగా మారింది.