Begin typing your search above and press return to search.

బాగా కెలికేసిన స్వామి : ఎర్రకోట హామీలు తెల్లబోతున్నాయా మోడీ...?

By:  Tupaki Desk   |   14 Aug 2022 7:39 AM GMT
బాగా  కెలికేసిన స్వామి : ఎర్రకోట హామీలు తెల్లబోతున్నాయా మోడీ...?
X
ఆయన నరేంద్ర మోడీ. ఆయన విశాలమైన చాతీని చూస్తే చాలు ఈ దేశం హాయిగా ధైర్యంగా నిద్రపోవచ్చు అని బీజేపీ వారు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. మోడీ అంటేనే ఇండియా అన్నట్లుగా మాట్లాడుతూంటారు. మరి మోడీ హయాంలో ఇండియా అభివృద్ధి ఏమి సాధించింది అంటే కమలం వారి లెక్కలు వారు చెబుతూంటారు. అయితే విమర్శకులు వాటిని పట్టుకుని చాలా గట్టిగా విమర్శిస్తూంటారు. మొత్తానికి ఎనిమిదేళ్ళ మోడీ ఏలుబడి మీద బీజేపీ వారి ప్రశంసలు ఎలా ఉన్నా విమర్శలే ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఆయన సొంత పార్టీకి చెందిన ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఆరోపణలు తరచూ చేస్తూ ఉంటారు. ఆయన రీసెంట్ గా మరో ఆరోపణ చేశారు. ప్రతీ సారి ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ వేళ నరేంద్ర మోడీ అనేక వరాలు ఇస్తూంటారు, అలాగే జాతి జనులకు ఎన్నో హామీలను కూడా ఇస్తారు. మరి వాటి సంగతేంటి అని స్వామి కెలికి వదిలారు. ఇప్పటికి అయిదేళ్ల క్రితం అంటే 2017న మోడీ ఇచ్చిన హామీలు ఈ రోజుకి అయినా నెరవేరాయా అని స్వామి లా పాయింట్ ని పట్టుకుని దులిపేశారు.

అనాడు మోడీ మాట్లాడుతూ రానున్న అయిదేళ్లలో ఆ హామీలను నెరవేరుస్తామని చెప్పారని స్వామి బాగానే గుర్తు చేశారు. మరి ఈ అయిదేళ్లలో వాటిని ఎంతవరకూ నెరవేర్చారు మోడీ సాబ్ అని స్వామి గట్టిగానే నిలదీస్తున్నారు. 2017లో ఎర్రకోట నుంచి మోడీ చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది ఏంటి అంటే ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని, మరి ఆ హామీ నెరవేరిందా అని స్వామి ప్రశ్నించారు.

అంతే కాదు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇళ్ళు ఇస్తామని మోడీ చెప్పారని, మరి ఆ హామీ ఏమైనా నెరవేరిందా అని కూడా సూటింగానే నిలదీశారు. మరో వైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కూడా చెప్పారని, అది కూడా చేసి ఏమైనా చూపించారా అంటూ నిగ్గదీశారు. ఇక బుల్లెట్ రైల్ మీద మోడీ చేసిన హామీని ఆయన గుర్తు చేశారు. ఈ హామీలన్నీ అయిదేళ్ళలో చేసి చూపిస్తామని చెప్పిన మోడీ వాటిని నెరవేర్చలేకపోయారని సుబ్రమణ్య స్వామి ఘాటుగానే విమర్శించారు.

మరిప్పుడు అంటె 2022 ఆగస్ట్ 15న ఎర్రకోట మీద నుంచి మోడీ ప్రసంగించబోతున్నారని, ఈసారి ఏ రకమైన హామీలు ఇస్తారో అని ఆయన ఆశ్చర్యంతో కూడిన వ్యంగాన్ని ప్రదర్శించారు. మొత్తానికి సొంత పార్టీలోనే స్వామి లాంటి సహచరుడు ఉండగా విపక్షాల విమర్శలు చేయడం ఎందుకు దండుగ అనిపిస్తుంది. అయితే మరో వైపు ఎర్రకోట మీద ఇచ్చిన హామీలను అలాగే తెల్లబోయేలా చేయడం మీద విపక్షాలు కూడా ఇపుడు గట్టిగా తగులుకుంటున్నాయి. మోడీ మాస్టారూ గంభీర ఉపన్యాసం కాదు, హామీలను నెరవేర్చండి సారూ అంటున్నాయి. మరి మోడీ స్వామి కెలుకుడుకైనా రెస్పాండ్ అవుతారా. ఏమో చూడాలి.