ఏపీకి 3 రాజధానుల పై కేంద్రం స్పందన ఇదే..

Tue Jan 21 2020 15:20:49 GMT+0530 (IST)

BJP MP Sensational Comments on AP Three Capitals

ఏపీకి 3 రాజధానులు ఏర్పాటైపోయినట్టే.. సీఎం జగన్ బిల్లు పెట్టడం.. ఆమోదించడం కూడా జరిగిపోయింది. అయితే ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలను కలిసి వారి అనుమతితోనే తాజాగా ప్రకటించారని మీడియా లో వార్తలు గుప్పుమన్నయి.. ఈ విషయంలో కేంద్రం సీఎం జగన్ కు సపోర్టుగా నిలిచిందని ప్రచారం జరిగింది.తాజాగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అధికారికంగా ఈ విషయంపై కేంద్రం స్పందన తెలియజేసింది. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం జోక్యం చేసుకోదని.. మోడీషాలు కూడా జగన్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని.. స్వయంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాదే తనతో చెప్పినట్టు బీజేపీ తెలుగు ఎంపీ జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.

ఏపీ రాజధాని మారకుండా కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్న టీడీపీ డిమాండ్ పై బీజేపీ ఎంపీ జీవిఎల్ మండిపడ్డారు. టీడీపీ తన అసమర్థతను లాభాపేక్ష కోసం బీజేపీని వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ఇక అమరావతియే ఏపీకి ఒక రాజధాని అన్న జగన్ వాదనను కూడా జీవీఎల్ తప్పుపట్టారు. న్యాయపరంగా చిక్కులు వస్తాయనే జగన్ అమరావతి కూడా ఒక రాజధాని అని ప్రకటించారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

ఇక అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అసెంబ్లీలో ప్రకటించిన జగన్ ఎందుకు టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. అవినీతి జరిగితే కేసులు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.