Begin typing your search above and press return to search.

రాహుల్ అనుకున్నదొకటి... జరిగిందొకటి !

By:  Tupaki Desk   |   15 April 2019 10:47 AM GMT
రాహుల్ అనుకున్నదొకటి... జరిగిందొకటి  !
X
ర‌ఫేల్ వివాదం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మాత్ర‌మే కాదు.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి సైతం త‌ల‌నొప్పిగా మారింద‌ని చెప్పాలి. ఈ ఇష్యూ మీద ఇప్ప‌టివ‌ర‌కూ మోడీని రాహుల్ ఎంత ఇరుకున పెట్టార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ మోడీని ఇబ్బంది పెట్ట‌టానికి చేసిన ప్ర‌య‌త్నాల్లో కొన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తాజాగా అలాంటిదే మ‌రొక‌టి ఎదురైంది. ర‌ఫేల్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు చేయ‌ని వ్యాఖ్య‌ల్ని.. చేసిన‌ట్లుగా రాహుల్ మాట్లాడార‌ని.. ఈ విష‌యంలో కోర్టు ధిక్కార‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లుగా బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ తాజాగా మండిప‌డుతున్నారు. రాహుల్ త‌న అభిప్రాయాల్ని సుప్రీం అభిప్రాయాలుగా ఆపాదిస్తూ కోర్టు ధిక్కార‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఒక పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం రాహుల్ గాంధీకి నోటీసులుజారీ చేసింది. తాము ఎప్పుడూ వ్యాఖ్యానించని వ్యాఖ్య‌ల్ని రాహుల్ మీడియా ముందు త‌మ మాట‌లుగా చెప్ప‌టంపై కోర్టు త‌ప్పు ప‌ట్టింది. దీనికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. తాము జారీ చేసిన నోటీసుల‌కు ఈ నెల 22లోపు రాహుల్ స‌మాధానం ఇవ్వాల‌ని సుప్రీం పేర్కొంది.

ర‌ఫేల్ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పును మ‌రోసారి స‌మీక్షించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనికి న్యాయ‌స్థానం ఓకే చెప్పింది. దీనిపై స్పందించిన రాహుల్.. దేశం మొత్తం చౌకీదారే దొంగ‌ని అంటోంద‌ని.. ఇప్పుడు సుప్రీంకోర్టుకూడా న్యాయం గురించి మాట్లాడింద‌ని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై మీనాక్షి లేఖీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించి.. రాహుల్ వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ కు నోటీసులు జారీ అయ్యాయి.