Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను కొట్టే ప్రయత్నంలో బీజేపీ..'బండి' ప్రయత్నాలు ఫలిస్తాయా?

By:  Tupaki Desk   |   7 July 2022 10:30 AM GMT
కేసీఆర్ ను కొట్టే ప్రయత్నంలో బీజేపీ..బండి ప్రయత్నాలు ఫలిస్తాయా?
X
కేంద్రంతో ఆట.. పులితో వేట రెండూ ఒకటే.. దేశంలోని రాష్ట్రాలను గుప్పిట పట్టి ఎంతగా కేంద్రం ఆడిస్తుందో అందరం చూస్తున్నాం. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని గద్దె దించి ఆ పార్టీలో ఎదురు తిరిగిన వారిపై కేంద్రంలోని బీజేపీ ఉక్కుపాదం మోపింది. సంజయ్ రౌత్ పై ఈడీ కేసులు పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఫుల్ ఫోకస్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ఆ దిశగా లూప్ హోల్స్ వెలికి తీసే పనిలో బిజీగా ఉంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా వేసిన అడుగులు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఐ చట్టం కింద ఏకంగా 86 అంశాలపైన ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలు చేసిన పథకాలు, అమలు చేయాల్సినవి.. అలాగే ఇప్పటివరకూ చేసిన ప్రభుత్వ ఖర్చులపై సమాచారాన్ని కోరుతూ బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులు చేయడం సంచలనమైంది. ఇక మీడియాకు ఇచ్చిన ప్రకటనల విలువపైనా లెక్కులు ఇవ్వాలని దరఖాస్తు చేశారు.

ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు చేసి పక్కా ఆధారాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయాలనుకుంటున్న బీజేపీ తీరుపై ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ బీజేపీ జాతీయ నేతలు ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ అవినీతిపై విమర్శలు చేస్తూ వచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. తమ వద్ద కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతూ వచ్చారు. ఇంతకాలం ఆధారాలు ఉన్నాయని చెప్పిన బీజేపీ నేతలూ, ఇప్పుడు ప్రభుత్వం చేసిన అన్ని పనులపై వివరాలు కావాలని ఆర్టీఐద్వారా దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ అన్ని శాఖలలోనూ వివరాల కోసం దరఖాస్తు చేసినా వివరాలు ఇవ్వాల్సింది మాత్రం ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులే.. ప్రగతిభవన్ నిర్మాణం నుంచి ప్రభుత్వ ప్రకటనల వరకూ అన్ని విభాగాల సమాచారం కోరినా ప్రభుత్వ శాఖల అధికారులు ఎలాంటి తేడాలు లేకుండా జాగ్రత్తగా సమాచారాన్ని ఇస్తారు. బండి సంజయ్ కోరిన సమాచారం రాదనే చర్చ సాగుతోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం డేటా బయటకు తీయడం పెద్ద పని కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించితే కేసీఆర్ ఆటకట్టవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించకుండా ఆర్టీఐ దరఖాస్తులా అంటూ చర్చిస్తున్నారు.