Begin typing your search above and press return to search.

కమలానికి ఎంత కష్టం : నోటా దాటలేక....చెల్లని ఓట్లని అధిగమించలేక...!

By:  Tupaki Desk   |   18 March 2023 8:00 AM GMT
కమలానికి ఎంత కష్టం : నోటా దాటలేక....చెల్లని ఓట్లని అధిగమించలేక...!
X
రాజకీయాల్లో పగవాడికి కూడా రాకూడని కష్టం బీజేపీకి వచ్చింది. అది కూడా ఒకసారి కాదు పదే పదే వస్తోంది. 2019లో నోటాతో పోటీ పడలేక చేతులెత్తేసిన బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో బ్యాలెంట్ పోరులోనూ అత్యంత వెనకబడింది లేటెస్ట్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం చెల్లని ఓట్లతో పోటీ పడలేక నిస్సహాయంగా నిలబడిపోయింది.

ముందుగా 2019 ఎన్నికల దాకా వెళ్తే నాడు బీజేపీకి పడ్డ ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువ. ఆ షేరే చాలా అధికంగా ఉంది. ఇపుడు చూస్తే పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్ల కంటే కూడా బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయంటే ఒక జాతీయ పార్టీకి ఇంతకంటే నగుబాటు ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.

ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీట్లో బీజేపీ పోటీ చేసింది. ఆ సీటు ఈ రోజు దాకా బీజేపీదే. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీ చేస్తే ఆయనకు మొత్తం పోలైన రెండు లక్షల ఓట్లలో వచ్చినవి జస్ట్ పదకొండు వేల ఓట్లుగా ఉన్నాయి. ఇక్కడ చెల్లని ఓట్లు చూస్తే .పన్నెండు వేల పై చిలుకు ఉన్నాయంటే బీజేపీ ఓడినట్లే కదా అని అంటున్నారు.

ఇదే విధంగా చూస్తే తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్లు అక్షరాలా ఆరు వేల కంటే తక్కువే అని లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా పశ్చిమ రాయలసీమలోనూ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు అదే సమయంలో చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి. అంటే బీజేపీ చెల్లని ఓట్లలోనూ ఫిఫ్టీ పెర్సెంట్ అయిందంటేనే ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ ఎదగాలని అనుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. అదే టైం లో తాము జాతీయ పార్టీ అని ఏపీలో తమ పరిస్థితిని కనీసంగా కూడా ఆలోచన చేయకుండా ఆర్భాటాలు పోవడమూ బీజేపీకే చెల్లింది అని అంటున్నారు.

అలాగే పొత్తు పార్టీలతో సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల కూడా బీజేపీ దెబ్బ తింటోంది అని అంటున్నారు. అఫీషియల్ గా జనసేనతో పొత్తు ఉంటే బీజేపీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడి జనసేన ఓట్లు తమ వైపు మళ్ళించుకునే ప్రయత్నం చేస్తే ఈ పరిస్థితి రాదు కదా అని అంటున్నారు. ఏది ఏమైనా పొత్తులో ఉన్నపుడు టీడీపీ ద్వారా 2017లో ఎమ్మెల్సీ అయిన పీవీఎన్ మాధవ్ ఇపుడు చెల్లని ఓట్లను దాటలేకపోవడం ఆ పార్టీ రాజకీయ ఇబ్బందిని తెలియచేస్తోంది అని అంటున్నారు.

ఏపీలో ప్రాంతీయ పార్టీల పని పడతాము, రేపటి రోజున అధికారంలోకి వచ్చేది మేమే అని బీరాలు పోవడం కాకుండా ముందు వాస్తవ పరిస్థితులను చూసి అవగాహన చేసుకుని దానికి తగినట్లుగా కార్యాచరణను రూపిందించుకుంటే బీజేపీకి మేలు అని అంటున్నారు. కానీ బీజేపీ బిల్డప్పులకు పడే ఓట్లకు మధ్య ఇంత తేడాను చూసిన వారు అంతా కమలానికి ఇంత కష్టమేంటి బాబోయ్ అనేస్తున్నారు.