సోనియాను ఫుల్ యాక్టివ్ చేసిన పుణ్యం బీజేపీదే

Sat Apr 01 2023 09:19:51 GMT+0530 (India Standard Time)

BJP Has Made Sonia Gandhi Fully Active

సోనియా గాంధీ రామా క్రిష్ణా అనుకుంటాను అని ఈ మధ్యనే జరిగిన  పార్టీ ప్లీనరీలో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నమ్మకస్తుడు అయిన మల్లికార్జున్ ఖర్గే నియమితులయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కొత్త ఇమేజ్ ని తెచ్చుకున్నారు. దాంతో కాంగ్రెస్ నెమ్మదిగా గాడిలో పడుతుందని తాను తెర వెనక ఉంటూ సలహాలు ఇవ్వవచ్చు అని సోనియమ్మ తలచారు.అయితే రాహుల్ గాంధీ ఎంపీ సీటు మీద అనర్హత వేటు వేసి బీజేపీ కాలు దువ్వింది అని అంటున్నారు. ఈ పరిణామంతో సోనియాగాంధీ ఆగ్రహం చెందారని అంటున్నారు. బీజేపీ దూకుడు చేస్తోందని ఏకంగా గాంధీ ఫ్యామిలీ మీదనే అటాక్ చేస్తోందని ఈ టైం లో తాను రిటైర్మెంట్ అంటూ కూర్చోవడం తగదని ఆమె నిర్ణయానికి వచ్చారని టాక్.

ఇక మీదట తాను అనారోగ్యాన్ని వయోభారాన్ని సైతం పక్కన పెట్టి జనంలోకి వస్తానని ఆమె అంటున్నట్లుగా తెలుస్తోంది. 2004లో జరిగిందే 2024లో జరిగి తీరుతుందని సోనియాగాంధీ నమ్ముతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడం ద్వారా కేంద్రంలో యూపీఏ త్రీని స్థాపించాలని ఆమె గట్టిగానే సంకల్పం తీసుకున్నారని అంటున్నారు.

రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం మీద లోక్ సభ సెక్రటేరియట్ ఆగమేఘాల మీద అనర్హత వేటు వేయడం పట్ల విపక్షాలు అన్నీ మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ మీద సానుభూతి సంఘీభావం విపక్షాలు ప్రకటించడంతో ఒక్కసారిగా  రాహుల్ కి బలమైన మద్దతు లభించినట్లు అయింది. అదే టైం లో విపక్షాలను అటూ ఇటూగా ఉన్న నాయకులను ఏకం చేయడంలో బీజేపీ నిర్ణయం ఉపయోగపడింది అని అంటున్నారు.

ఇక సోనియా గాంధీ బీజేపీకి ఎదురు నిలిచి పోరాడాలని తీర్మానించుకున్నారు. ఆమె యూపీయే పక్షాలతో  కలసి సమాలోచనలు చేస్తున్నారు. అన్ని పార్టీలను ఒకే త్రాటి మీదకు తీసుకురావడం ద్వారా మోడీ సర్కార్ ని గద్దె దింపాలని చూస్తున్నారు. అయితే బీజేపీకి 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్ల షేర్ లభించింది. అదే కాంగ్రెస్ ఓట్ల షేర్ 19 శాతానికి తగ్గిపోయింది. ఈ మధ్య నాలుగేళ్ల కాలంలో కాంగ్రెస్ పుంజుకుంది అని భావిస్తున్నా బీజేపీని ఢీ కొట్టే బలం ఉందా అన్నదే చర్చగా ఉంది.

ఇంకో వైపు చూస్తే సోనియా గాంధీ సమరానికి సై అనడం ఆమె నయాక్త్వ పటిమ వ్యూహాలు ఎత్తులు అన్నీ కూడా విపక్షాలకు నమ్మకం కలిగించేలా ఉండడంతో బీజేపీకి యాంటీగా బలమైన కూటమి అయితే వచ్చే ఎన్నికల ముందు ఏర్పాటు అవుతుందని అంటున్నారు. మరి రాహుల్ మీద అనర్హత వేటు కోర్టు తీర్పు లోక్ సభ సెక్రటేరియట్ డెసిషన్ అని ఎంత చెప్పుకున్నా అంతటి కీలక నిర్ణయం బీజేపీకి తెలియకుండా జరగదు కాబట్టి ఇదంతా బీజేపీ పుణ్యమే అంటున్నారు.

సోనియా యాక్టివ్ అయితే ఆమె మీద నమ్మకంతో మమతా బెనర్జీ కేజ్రీవాల్ లాంటి వారు సైతం ఈ వైపుగా వస్తారని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మెజారిటీ వస్తుందా రాదా అన్న డౌట్ లో ఉన్న కమలం పెద్దలు ఇపుడు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ విపక్ష శిబిరం సోనియా కేంద్రంగా గట్టిగా నిలబడేందుకు అవకాశం ఏర్పడింది అని అంటున్నారు.