Begin typing your search above and press return to search.

మైండ్ గేమ్: గ్రేటర్ ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు ఎందుకు వస్తున్నట్లు?

By:  Tupaki Desk   |   26 Nov 2020 2:00 PM GMT
మైండ్ గేమ్: గ్రేటర్ ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు ఎందుకు వస్తున్నట్లు?
X
హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు జరుగుతున్నది స్థానిక ఎన్నికలు. అలాంటి లోకల్ ఎలక్షన్లకు కేంద్రంలో కొలువు తీరిన అధికారపార్టీకి చెందిన జాతీయ నేత పని కట్టుకొని రావటం ఏమిటి? ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితుడిగా..ఆయన నీడగా చెప్పే అమిత్ షా లాంటి అగ్రనేత.. స్థానిక ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అవసరం ఏమిటి? అదొక్కటేనా? బీజేపీకి చెందిన అగ్రనేతలు.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రితో సహా కేంద్రమంత్రులు అదే పనిగా రావటంలో మర్మమేమిటి? అన్నది మరో ప్రశ్న.

ఇదే విషయాన్ని తనకు అనుకూలమైన వాదనను వినిపిస్తోంది టీఆర్ఎస్. వరదలొచ్చి ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు కనిపించని నేతలు ఇప్పుడు మాత్రం.. పోలోమని వచ్చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్.. హరీశ్ మొదలుకొని టీఆర్ఎస్ నేతలంతా విమర్శలు చేస్తున్నారు. వరదలతో మునిగిపోయిన హైదరాబాదీలను పరామర్శించటానికి కేంద్రమంత్రులు రాలేదన్న విషయాన్ని ప్రస్తావించే గులాబీ నేతలు.. తమ అధినేత కేసీఆర్ అడుగు బయటపెట్టలేదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. అంతేకాదు.. వరదలతో తల్లడిల్లుతున్న వేళ.. తాము చేయబోతున్న సహాయక కార్యక్రమాల్ని సైతం చెప్పని తీరును వారు మర్చిపోతున్నారు.

ఇంతకూ హైదరాబాద్ లోకల్ ఎలక్షన్ ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు ఎందుకు వస్తున్నారన్న విషయంలోకి వెళితే.. మైండ్ గేమ్ లో భాగమేనని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసే వరకు.. తెలంగాణ విషయంలో ఏం చేయాలన్న విషయంపై బీజేపీ అధినాయకత్వం ఊగిసలాటలో ఉన్నట్లు చెబుతారు. తెలంగాణలో పార్టీ బలపడేందుకు అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించినప్పటికీ.. కేసీఆర్ లాంటి నేత ఉండటం.. ఆయనతో పెట్టుకోవటం మిగిలిన అధినేతల మాదిరి కాదన్న భావన వారిలో వ్యక్తమవుతూ ఉంటుంది.

అందుకే ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ.. ఇక తెలంగాణ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక లోకల్ ఎలక్షన్ కు జాతీయ స్థాయి నేతలు రావటం ద్వారా స్థానిక బీజేపీ నేతలకు నైతికస్థైర్యాన్ని ఇవ్వటంతో పాటు.. వాళ్ల వెనుక మేం ఉన్నామన్న సందేశాన్ని ఇస్తున్నట్లుగా చెప్పాలి. ఏదైనా తేడా చేస్తే.. కేంద్రమే సీన్లోకి వస్తుంది సుమా అన్న సంకేతాన్ని ఇవ్వటంతో పాటు.. మేమంతా ఉన్నాం.. మీరు ఫైట్ చేయాలని చెప్పినట్లే. టీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు.

అందునా సామ..దాన.. దండోపాయాలు తెలిసిన కేసీఆర్ లాంటి అధినేత ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఎన్నికల విషయంలో తాము సైతం చాలా సీరియస్ గా ఉన్నామన్న అంశాన్ని కమలనాథులు సైతం సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించమన్న విషయం కమలనాథులకు బాగా తెలుసు. అయినప్పటికి గట్టిపోటీ ఇవ్వటం ద్వారా.. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఒకటి తయారైందన్న సందేశాన్ని గ్రేటర్ ఫలితం ద్వారా ఇవ్వటమే అసలు వ్యూహంగా చెప్పక తప్పదు.