Begin typing your search above and press return to search.

కోహ్లీ స్థానంలో రోహిత్ కెప్టెన్.. స్పందించిన బీసీసీఐ

By:  Tupaki Desk   |   13 Sep 2021 1:29 PM GMT
కోహ్లీ స్థానంలో రోహిత్ కెప్టెన్.. స్పందించిన బీసీసీఐ
X
టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డేతోపాటు టీ20 టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. టీమిండియా కెప్టెన్ ను మార్చే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ స్థానంలో రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల కెప్టెన్ గా నియమించాలనే వార్తలను బీసీసీఐ ఖండించింది. బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ సోమవారం ఈ వార్తలు నిరాధారమని పేర్కొన్నాడు.

టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీనే ఉంటాడని తేల్చిచెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలు తప్పని బీసీసీఐ కోశాధికారి క్లారిటీ ఇచ్చాడు. ‘ఇవన్నీ మీడియా తయారు చేసిన వంటకాలు. స్ల్పిట్ కెప్టెన్సీ గురించి బోర్డు ఇంతవరకు చర్చించలేదు. అలాంటి ఆలోచనే చేయలేదు. ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీనే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తాడు’ అని తెలిపాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ మార్పు చూడబోతున్నామని జాతీయ మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి. విరాట్ కు బదులుగా రోహిత్ శర్మను టీ20, వన్డే కెప్టెన్లుగా చేయబోతున్నాయని కథనాలు వెలువడ్డాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. త్వరలోనే కెప్టెన్ గా రోహిత్ ను ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఇప్పటికే విజయవంతం అయ్యాడని.. ఐపీఎల్ లోనూ సత్తా చాటి ఐదుసార్లు ముంబైని చాంపియన్ చేశాడని రాసుకొచ్చింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ముందు రోహిత్ 2021లో కెప్టెన్ గా నిరూపిస్తాడని రాశారు.

బ్యాటింగ్ పై దృష్టి సారించేందుకే విరాట్ కోహ్లీ స్వయంగా కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని ప్రకటించాడని.. నాయకత్వ బాధ్యతను రోహిత్ కు ఇచ్చేస్తాడని నిర్ణయించుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ కథనాలు కల్పితం అంటూ బీసీసీఐ తాజాగా కొట్టిపారేసింది.