టీమిండియా ఆటగాళ్ల మెనూ.. మరోసారి చర్చనీయాంశమాయెను

Thu Nov 25 2021 07:00:02 GMT+0530 (IST)

BCCI interfering Team India players menu

భారత్ వంటి దేశంలో క్రికెట్ కంటే పెద్ద మతం ఏమీ ఉండదు.. అందుకే క్రికెటర్లు ఏం తింటారు? ఏం తాగుతారు? అనేవి ఎప్పుడూ ఆసక్తికర విషయాలే.. గతంలో టీమిండియా విదేశీ పర్యటనలో తీవ్ర వైఫల్యం చెందిన సందర్భంలో ఆటగాళ్ల డైట్ విషయం చర్చకు వచ్చింది. సరైన ఆహారం లేని కారణంగానే మంచి ప్రదర్శన చేయలేకపోయారన్న వార్తలు వచ్చాయి. అయితే వ్యక్తిగతంగా ఏ ఆటగాడూ దీనిని ప్రకటించలేదు.అధికారికంగా బీసీసీఐ కూడా ఏమీ చెప్పలేదు. దీంతో అదొక ప్రచారం గానే మిగిలిపోయింది. కాగా ఆహారం ఆహార్యం ఎలా ఉన్నా.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు మైదానంలోకి దిగాక గెలుపు మాత్రమే లక్ష్యం కావాలి. కారణాలు చెబితే పిల్ల చేష్టగా ఉంటుంది. అందుకనే ఆటగాళ్లెవరూ నాటి విదేశీ పర్యటనలో తమకు ఎదురైన అనుభవాన్ని చెప్పలేదు.

కివీస్ తో సిరీస్ కు ముందు ఇప్పడు

గురువారం నుంచి న్యూజిలాండ్ తో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల మెనూ పై వివాదం నెలకొంది. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. శాకాహారం మాంసాహారం అంటూ ఆంక్షలు విధిస్తున్నారని తెలిసింది. అయితే తామేమీ అలా చేయడం లేదని సంస్థ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఆటగాళ్లు వారికి ఇష్టమైనది తినవచ్చని అది శాకాహారామా? మాంసాహారమా? అన్నది అప్రస్తుతమని తెలిపారు.

ఆ రెండు మాంసాలను నిషేధించారా?

గురువారం తొలి టెస్టు జరుగనున్నది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కాగా.. ఆ సందర్భంగా ఆటగాళ్ల మెనూలో పంది ఆవు మాంసాన్ని నిషేధించారని కేవలం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే అందించనున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో వ్యక్తిగత విషయమైన ప్లేయర్ల ఆహార అలవాట్లపై జోక్యం ఏమిటంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. భారత్ తో పాటు న్యూజిలాండ్ జట్టులోనూ ముస్లిం ఆటగాళ్లు ఉండడంతో హలాల్ చేసిన ఆహారం అందించాలని బీసీసీఐ భావించినట్లు సమాచారం.

మీకు తెలుసా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంతటి ఫిట్నెస్ ఫ్రీక్ అనేది అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తాను తీసుకునే ఆహారం విషయంలోనూ కోహ్లి చాలా శ్రద్ధ వహిస్తాడు. అతడు తాగే నీటి విలువ భారత కరెన్సీలో లీటరు రూ.400పైనే కావడం విశేషం. మిగతా ఆహారం విషయంలోనూ కోహ్లి చూపే జాగ్రత్త అతడి ఫిట్నెస్ రహస్యంగా అందరూ చెప్పుకొంటారు.