Begin typing your search above and press return to search.

దేశమంతా పాటిస్తుంటే.. బీసీసీఐ మాత్రం

By:  Tupaki Desk   |   4 Aug 2020 12:10 PM GMT
దేశమంతా పాటిస్తుంటే.. బీసీసీఐ మాత్రం
X
బాయ్‌కాట్ చైనా.. బాయ్‌కాట్ చైనా.. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదమిది. ఇది మామూలు జనాలు ఎమోషన్‌తో అంటున్న మాట కాదు. పెద్ద పెద్ద నాయకులు, ప్రముఖులు, కేంద్ర మంత్రులు సైతం ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. స్వయంగా ప్రభుత్వమే 59 యాప్‌లను నిషేధించింది. చైనా భాగస్వామ్యం ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టుల్నే రద్దు చేస్తున్నారు. ఈ రోజు దేశమంతా కరోనాతో అల్లాడుతుండటానికి చైనానే కారణం అని అందరికీ తెలుసు. ఐతే కరోనా వ్యాప్తిని ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్నది చెప్పలేం. కానీ మన శత్రు దేశమైన పాకిస్థాన్‌కు సాయం చేస్తూ మన మీదికి చైనా ఉసిగొల్పడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. అది చాలదన్నట్లు.. ఈ మధ్య భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి.. చిన్నపాటి యుద్ధానికి కూడా దిగింది చైనా. ఈ దాడిలో 23 మంది భారత సైనికులు అసువులు బాసారు. చైనాకు కూడా నష్టం జరిగినప్పటికీ కవ్వింపులకు పాల్పడిందే ఆ దేశం.

ఈ నేపథ్యంలో చైనా వ్యతిరేక ఉద్యమం దేశంలో ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయం నివ్వెరపరుస్తోంది. భారత బోర్డు నిర్వహించే ఐపీఎల్‌కు చైనా కంపెనీ అయిన వివో టైటిల్ స్పాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఏటా రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తుంది వివో. ఐతే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సహా అనేక సంస్థలు చైనా కంపెనీలతో భాగస్వామ్యం తెంచుకుంటున్నాయి. మరి బీసీసీఐ కూడా అదే బాటలో నడవాలని డిమాండ్ వినిపిస్తోంది. కానీ భారత బోర్డు అదేమీ పట్టించుకోకుండా వివోతో భాగస్వామ్యం కొనసాగుతుందని తేల్చేసింది. వచ్చే నెల నుంచి యూఏఈలో జరగబోయే ఐపీఎల్ 13వ సీజన్‌కు వివోనే టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగనుంది.

ఇది భారత క్రికెట్ అభిమానులకే కాదు.. ఎవ్వరికీ నచ్చట్లేదు. దీంతో ఐపీఎల్‌ను బహిష్కరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం ప్రజలకు చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలని చెబుతుంటే బీసీసీఐ మాత్రం ఇలా వివోతో ఎలా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఇంకా వివిధ వర్గాల నుంచి ఈ విషయమై బీసీసీఐకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.