Begin typing your search above and press return to search.

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదం.. అమెరికా వైఖరి ఏంటంటే?

By:  Tupaki Desk   |   24 Jan 2023 4:04 PM GMT
మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదం.. అమెరికా వైఖరి ఏంటంటే?
X
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ సంస్థ ఇటీవల రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై 'ఇండియా.. ది మోదీ క్వశ్చన్' పేరిట బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా ఇది కాస్త వివాదాన్ని రాజేసింది. ఈ డాక్యుమెంటరీపై కేంద్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక విద్వేష పూరిత చర్యగా అభివర్ణించింది.

విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ 'ఇదొక ప్రచార కార్యక్రమమని.. వారు ఎంచుకున్న కోణాన్ని మాత్రమే ప్రచారం చేయడానికి దీనిని రూపొందించారు' అంటూ వ్యాఖ్యానించారు. ఈ డాక్యుమెంటరీపై తాజాగా అమెరికా స్పందించింది. అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో మాట్లాడారు.

మీరు చెబుతున్న డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదన్నారు. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా.. భారత్ కు వాటి భాగస్వామ్య విలువల గురించి తెలుసన్నారు.

భారత ప్రజాస్వామ్యం శక్తివంతమైనదని.. ఈ రెండు దేశాలను కలిపి ఉంచడంపై తమ దృష్టి అని చెప్పారు. ఈ బంధాల బలోపేతం గురించి తాము ఆలోచిస్తామన్నారు. వీటిలో ఇరుదేశాల రాజకీయ సంబంధాలు.. ఆర్థిక సంబంధాలు ఉంటాయని నెడ్ ప్రైస్ తెలిపారు.

ఈ విషయంపై బ్రిటన్ సైతం ఇదివరకే ఇలానే స్పందించింది. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీలోని విషయాలను తాను పూర్తిగా అంగీకరించలేనని ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు.

ఈ డాక్యుమెంటరీ వివాదం నుంచి ఆయన దూరంగా జరిగారు. మరోవైపు ఈ డాక్యుమెంటరీ వివాదాస్పద కావడంతో యూకేలో దీనిపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.

గత వారం ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మొదటి భాగంగా ప్రసారమైంది. ఇందులో దుష్పచారం.. వీక్షకులను తప్పుదోవ పట్టించే కోణం ఉందని.. నిర్దిష్ట ప్రమాణాలు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి ప్రసారం కానున్న రెండో భాగాన్ని నిలిపివేయాలని ఆ పిటిషన్ లో అభ్యర్థించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.