ఆయన ముఖం చూడలేదంటున్న అయ్యన్న... ?

Wed Dec 08 2021 16:00:01 GMT+0530 (IST)

Ayyanna patrudu shocking statement

ఆయన విశాఖ జిల్లాను నోడల్ జిల్లాగా ఎంచుకుని అక్కడే ఆరేళ్ళుగా పాతుకుపోయిన నాయకుడు. 2015లో విశాఖకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఇపుడు అక్కడ పవర్ ఫుల్ లోకల్ లీడర్ అయిపోయారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో విజయసాయిరెడ్డి హవా మామూలుగా లేదు.విశాఖ జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులకు ఆయన సుపరిచితమే. అయితే ఇంతవరకూ ఆయన ముఖం చూడలేదు అంటున్నారు టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. తాను విశాఖ జిల్లాకు చెందిన వాడినే అయినప్పటికీ ఏ ఒక్క కార్యక్రమలోనూ ఆయన తనకు తారసపడలేదు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యన్న.

అయ్యన్నటీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి. అయినా కానీ రాజకీయ నాయకులు ప్రైవేట్ కార్యక్రమాల్లో కలుసుకోవడం పరిపాటి. రాజకీయాలు ఎలా సాగినా వాటికి అతీతంగా ముచ్చట్లు పెట్టుకోవడం ఎక్కడైనా జరుగుతున్న విషయమే. అయితే వైసీపీ వచ్చాక మాత్రం ఈ తరహా రాజకీయానికి చెల్లుచీటి ఇచ్చేశారు అనుకోవాలి. టీడీపీ వైసీపీ రాజకీయ పార్టీలుగా కంటే కూడా ప్రత్యర్ధులుగానే ఉంటున్న సీన్ ఎటు చూసినా ఉంది.

ఇక విశాఖలో ఎమ్మెల్యేల ఇళ్ళలో పెళ్ళి పేరంటాలు జరుగుతాయి. వాటికి కూడా వీరు వచ్చిన వేళల్లో వారు రారు వారు వస్తే వీరు దూరంగా ఉంటారు. దాంతో పెళ్ళికి పిలిచిన వారే ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక విజయసాయిరెడ్డి మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చే అయ్యన్నపాత్రుడు అయితే ఆయన తనకు ఎపుడూ ఎదురుపడలేదనే చెప్పుకొచ్చారు.

తనకు ఆయనకు మధ్య ఎలాంటి ముఖ పరిచయం కూడా లేదని అయ్యన్న చెప్పడం విశేషం. మరి మీరు ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు అని ఒక చానల్ లో ఆయన్ని అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డే తనను టార్గెట్ చేశారని అయ్యన్న బదులిచ్చారు. ఆయన ఎలా ఉంటారో అసలు ఆయన ఏంటో కూడా తనకు అనవసరం అని కానీ ఆయన మాత్రం తన మీద గురి పెట్టి రాజకీయాన్ని చేయడం వల్లనే గట్టిగా విమర్శలు చేయాల్సి వస్తోంది అని అంటున్నారు.

మొత్తానికి చూసుకుంటే విజయసాయిరెడ్డి అయ్యన్నపాత్రుడు ల గ్రూప్ ఫోటో అన్నది ఎవరికైనా దొరకడం కష్టమే అన్న రాజకీయం ఉంది. ఇతర రాజకీయ నాయకులు ఏదో సందర్భంలో ఎదురు పడినా కూడా అయ్యన్న పాత్రుడు మాత్రం ఆయనతో దూరమే అంటున్నారు. విజయసాయిరెడ్డి తన సొంత విషయాల మీద దృష్టి పెడుతున్నారని తన సొంత కుటుంబాన్ని వీడదీశారన్న ఆవేదన అయితే అయ్యన్నలో బాగా ఉంది అనుకోవాలి.