మాంద్యం వేళ సర్ ప్రైజ్ చేసిన అవని మల్హోత్రా.. రూ.65 లక్షల ప్యాకేజీ సొంతం

Fri Mar 31 2023 09:41:40 GMT+0530 (India Standard Time)

Avani Malhotra owns a package of Rs 65 lakhs

మాంద్యం మాట ఉద్యోగుల్ని వణికిస్తోంది. ఉన్న ఉద్యోగాలు ఉన్నపళంగా పోతున్న వేళ.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి వేళలో.. రికార్డు జీతంతో భారీ ప్యాకేజీని సొంతం చేసుకోవటం సాధ్యమా? అంటే అవునని నిరూపించింది అవని మల్హోత్రా. జైపూర్ కు చెందిన ఈ అమ్మాయి సాధించిన భారీ ప్యాకేజీతో ఇప్పుడామె యూత్ ఐకాన్ గా మారింది.ఐఐఎం సంబల్ పూర్ విద్యార్థుల ప్లేస్ మెంట్ భారీ వార్తగా మారింది. గడిచిన ఏడేళ్ల మాదిరే తాజాగా కూడా నూటికి నూరు శాతం ప్లేస్ మెంట్స్ తో  రికార్డును క్రియేట్ చేసింది. మాంద్యం వేళ.. ఈసారి ప్లేస్ మెంట్స్ ఎలా ఉంటాయన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయటం ఆసక్తికరంగా మారింది. 2023లో ఎంబీఏ ఉత్తీర్ణులైన 167 మంది విద్యార్థులు వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీల్లో ప్లేస్ మెంట్ సాధించారు. ఈ సంస్థల్లో మైక్రోసాఫ్ట్.. డెలాయిట్.. అమెజాన్.. వేదాంత.. తోలారం.. అమూల్.. అదానీ.. యాక్సెంచర్.. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఉన్నాయి.

మొత్తం బ్యాచ్ కు క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో ప్లేస్ మెంట్స్ ను సొంతం చేసుకున్నారు. మొత్తం విద్యార్థుల్లో 80 మంది అమ్మాయిలు ఉంటే.. వారిలో రూ.65 లక్షల (రూ.64.61లక్షలు) భారీ ప్యాకేజీని సొంతం చేసుకున్న జైపూర్ కు చెందిన అవని మల్హోత్రా కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఐటీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ లో ప్లేస్ మెంట్ ను సొంతం చేసుకుంది. ఇక.. అత్యధిక ప్యాకేజీని సొంతం చేసుకున్న వారిలో తమిళనాడు.. రాజస్థాన్ విద్యార్థులు నిలవటం గమనార్హం.

బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ చదవటం.. అనంతరం ఇన్ఫోసిస్ లో మూడేళ్లు పని చేయటం తనకు కలిసి వచ్చినట్లుగా ఆమె చెబుతున్నారు. ఈ సవాలును ఛేదించటంలో తన తల్లిదండ్రులు.. ప్రొఫెసర్లు తనకు సాయం చేశారని చెబుతున్నారు. తమ సంస్థలో కోర్సు పూర్తి చేసిన వారిలో అత్యధిక వార్షిక జీతం రూ.64.61 లక్షలుకాగా.. సగటు జీతం రూ.16లక్షలుగా ఉన్నట్లుగా వర్సిటీ చెబుతోంది.