Begin typing your search above and press return to search.

పోడియం వద్దకు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ సరే.. ఫ్యూచర్ మాటేంటి?

By:  Tupaki Desk   |   20 March 2023 5:42 PM GMT
పోడియం వద్దకు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ సరే.. ఫ్యూచర్ మాటేంటి?
X
ముచ్చటగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్ని సొంతం చేసుకున్న ఊపులో ఉన్న విపక్ష తెలుగుదేశం పార్టీ.. అనూహ్యంగా ఓటమిని రుచి చూసిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సమావేశమైన వేళ.. ఎలాంటి సన్నివేశాలు ఎదురవుతాయి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆసక్తిగా ఎదురుచూసిన చాలామందికి.. అంచనాలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. తాము సాధించిన పట్టును ప్రదర్శించాలన్న ఉత్సాహం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తే.. దెబ్బ తిన్న పులుల మాదిరి మాంచి కసి మీద ఉన్న వైనం వైసీపీ ఎమ్మెల్యేల్లో కనిపించింది. ఎవరి వెర్షన్ వారు చెప్పుకోవటాన్ని పక్కన పెడితే.. ఏపీ అసెంబ్లీలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని మాత్రం చెప్పక తప్పదు.

దీనిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతోపాటు.. సంచలన రూలింగ్ ఒకటి చేశారు. దీని ప్రకారం పోడియం దగ్గరకు వచ్చే సభ్యులు ఆటోమేటిక్ గా సస్పెన్షన్ చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. లైన్ దాటకుండా నిరసనను తెలియజేసే హక్కు సభ్యులకు ఉందన్న ఆయన.. పోడియం వద్దకు వస్తే సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేశారు. అంతేకాదు.. సోమవారం సభలో చోటు చేసుకున్నపరిణామాలపై స్పందించిన ఆయన..టీడీపీ ఎమ్మెల్యేల తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

సభలో దాడులు చేయాలని టీడీపీ సభ్యులకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించిన స్పీకర్.. సభను సజావుగా నడిపించటమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. తాజాగా స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభ్యుల దూకుడును కట్టడి చేయటానికి ఇలాంటివి తప్పవన్న మాట పలువురు సభ్యుల నోటీ నుంచి వినిపిస్తుంటే.. మరికొందరి వాదన మరోలా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి రూలింగ్ చేస్తారు. రేపొద్దున విపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే.. వారు తెచ్చిన రూలింగ్ వారికే ఇబ్బందిగా మారుతుందని పేర్కొనటం గమనార్హం.

సభ్యుల దూకుడును కట్టడి చేయటానికి రూలింగ్ లు మాత్రమే ఉపయోగపడవని.. సానుకూల వాతావరణంలో సభ్యుల నడుమ చర్చలు జరపటం ద్వారా కూడా సభను సజావుగా జరిపే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇలాంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా? అన్నది అసలు ప్రశ్న. మరి.. తాజాగా తెచ్చిన రూలింగ్ రాబోయే రోజుల్లో వైసీపీ వారికి ఎలాంటి అనుభవాల్ని ఎదురయ్యేలా చేస్తుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.