అమెరికా అయినా ఇండియా అయినా చంపేస్తుంటే వీడియోలు తీస్తుంటారు

Mon Aug 15 2022 11:54:41 GMT+0530 (IST)

Author Salman Rushdie stage at a Chautauqua Institute event

మనల్ని మనం కించపర్చుకోవటంలో భారతీయుల తర్వాతే ఎవరైనా. ఇటీవల చోటు చేసుకున్న ఘోరం.. దానికి సంబంధించిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకొంటోంది.ఇలాంటి వేళ.. ఆ దారుణ ఘటనకు సంబంధించిన ఘటనను చూసినప్పుడు అనిపించేది ఒక్కటే..ఏదైనా దారుణం జరిగితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం కంటే కూడా.. దాన్ని దూరం నుంచి తమ సెల్ ఫోన్లలో బంధించే పనిలోనే జనాలు బిజీగా ఉంటారన్నది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఈ వాదనను బలపర్చింది.

ప్రముఖ రచయిత.. ప్రాణహాని తీవ్రంగా ఉన్న సల్మాన్ రష్దీని న్యూయార్కులో జరిగిన ఒక కార్యక్రమంలో హత్య చేసే క్రమంలో దారుణంగా గాయపర్చటం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో దూరం నుంచి షూట్ చేసిన వైనం కనిపిస్తుంది.

దాడి వెంటనే.. గందరగోళం చోటు చేసుకోవటం.. ఆ క్షణాల్లో వేదిక మీద ఉన్న ఒక వ్యక్తి అయోమయంతో ఉండిపోయి.. స్టేజ్ మీద నుంచి కిందకు దిగిపోతే.. భద్రతా సిబ్బంది మాత్రం రష్దీకి ఏమైందన్న ఆందోళనతో ఆయన వద్దకు వెళ్లి సాయం చేసే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే.. సభకు వచ్చిన వారంతా జరిగిన దారుణం.. తర్వాతి పరిస్థితుల్ని ఎవరికి వారు తమ ఫోన్లలో ఉన్న కెమేరాల్ని ఆన్ చేసి షూట్ చేయటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే పరిస్థితి మన దగ్గర చోటు చేసుకుంటే.. మనలో మానవత్వం చచ్చిపోయిందని..ఒక వ్యక్తి ప్రాణహాని కలిగిస్తుంటే కాపాడటం పోయి.. అలా వీడియోలు తీసుకోవటమా? అని తిట్టిపోస్తాం.

కానీ.. తాజా పరిణామాన్ని చూస్తే మాత్రం.. భారత్ లోనే కాదు అమెరికాలోని ప్రజలు సైతం అనూహ్య పరిస్థితుల్లో ఒకేలా వ్యవహరిస్తారన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.