బంగారం గనులు.. తవ్వుకునే ఘనులు వారే...?

Thu Aug 18 2022 05:00:01 GMT+0530 (IST)

Auction Gold Mining in Andhrapradesh

అవును. గనుల తవ్వకాలు అంటే ఘనులే రంగంలోకి దిగాలి. వారికి అన్ని రకాలైన పరపతీ పలుకుబడీ ఉండాలి. ఒక్కసారి తవ్వడం మొద్లెడితే పాతాల కుహరాలు కదిలిపోవాలి. మరి అంతటి సత్తా ఎవరికి ఉంటుంది అంటే అందరికీ తెలిసిందే. విషయానికి వస్తే ఏపీలో బంగారు గనుల తవ్వకాల తవ్వకలకు కేంద్రం టెండర్లను ఆహ్వానిస్తూ ఈ ఏడాది మార్చి 21న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.దేశవ్యాప్తంగా పదమూడు బంగారు గనుల తవ్వకలకు నోటిఫై చేస్తే అందులో ఒక్క ఏపీలోనే పది దాకా ఉన్నాయి. వీటిలో రామగిరి నార్త్ బ్లాక్ బొకసంపల్లి నార్త్ బ్లాక్ బొకసంపల్లి సౌత్ బ్లాక్ జవకుల-ఎ జవకుల-బి జవకుల-సి జవకుల-డి జవకుల-ఒ జవకుల-ఎఫ్ బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నట్లుగా అధికార వర్గాలు తెలియచేస్తున్నాయి.

మరి ఈ బంగారం గనులను తవ్వుకుని పోయేది ఎవరు అంటే పాతవారే అన్న జవాబు కూడా వస్తోంది. ఏపీలో గనులు అంటే కర్నాటకలు చెందిన గాలి జనార్ధనరెడ్డి పీరు వినిపిస్తూ ఉంటుంది. ఆయన అనంతపురం జిల్లాలో మైనింగ్ కాంట్రాక్టులను దక్కించుకుని గతంలో పెద్ద ఎత్తున కధ నడిపారు. ఇక ఆయన పేరే ఇపుడు బంగారు గనుల తవ్వకాల విషయంలో కూడా వినిపిస్తోందిట.

ఈ బంగారం గనుల మైనింగులో గాలికి చెందిన సంస్థ పాలుపంచుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టునకు ఇటీవలే తెలియచేసింది అంటున్నారు. అంటే గాలికి ఏపీలో అనుకూల గాలి వీస్తోంది అనే భావించాలి. ఆయన కనుక బంగారం గనుల విషయంలో సీన్ లోకి వస్తే పట్టిందల్లా బంగారమే అవుతుందని అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే భారత్ గోల్డ్ మైన్స్ అనే సంస్థ కూడా ఈ వేలంలో పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సంస్థ అనంతపురం జిల్లాలో 2001 దాకా మైనింగ్ ని నిర్వహించి ఆ మీదట ఆపేసింది.  ఇపుడు తిరిగి తవ్వకాలను ప్రారంభిస్తున్నట్లుగా ఈ సంస్థ తెలియచేస్తోంది. అంటే బిగ్ షాట్స్ వేలం లోకి దిగిపోతున్నారు అన్న మాట.

ఇకపోతే బంగారం గనుల తవ్వకం అంత తేలికైన వ్యవహారం కాదని కూడా నిపుణులు చెబుతారు. భూమిలోకి యాభై మీటర్ల వరకూ తవ్వినా కూడా మొదట బంగారం అన్నది బయట పడదు ఆ తరువాత లోతుకు పోయిన కొద్దీ బంగారం పండుతుంది. అయితే ఒక టన్ను మట్టి తవ్వితే అందులో నాలుగు గ్రాముల బంగారం మాత్రమే దొరుకుతుందిట. ఇక ఈ వేలం వేస్తున్న బ్లాక్స్ లో చూస్తే దాదాపుగా పదహారు టన్నుల బంగారం వెలుగు చూడగలదు అని అంటున్నారు. అంటే బంగారమే అంతా అన్న మాట.

ఇకపోతే మన మైనింగ్ ఘనులు ఒక పేరు మీద వేలం పాడేసి మిగిలినవి అన్నీ కూడా తవ్వి పాతరేస్తూంటారు. ఇపుడు కూడా బంగారం కోసం వేలం పాడేసుకుని మిగిలిన ఖనిజ సంపదను కూడా అక్రమంగా వెలికితీయరన్న నమ్మకాలు అయితే ఎవరికీ లేవు. అంటే ఇదంతా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంగానే సాగిపోతుంది అన్న మాట. అయినా ముందే చెప్పుకున్నట్లుగా అన్ని రకాలైన పలుకుబడి కలిగిన పెద్దలకు ఈ తవ్వకాలు ఒక లెక్కా. సో ఘనులంతా సీన్ లోకి దిగిపోతున్నారుట. పట్టిందల్లా బంగారమే అని వేలం పాడుకుంటారుట.