ఆ పదవులు ఎవరికో?

Wed Dec 08 2021 14:11:41 GMT+0530 (IST)

Attempts by some leaders for a place on the committee

తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. 12 స్థానాలకు గాను ఆరు స్థానాలు ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం కాగా.. మరో ఆరు స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లోనూ విజయ బావుటా ఎగరేసేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే మరో వైపు రాష్ట్ర నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల కంటే కూడా త్వరలో ఏర్పాటు చేయబోయే టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో చోటు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఆ కమిటీలో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ కొనసాగుతోంది. మరోవైపు కీలకమైన రాష్ట్ర కమిటీలో చోటు కోసం ఆశావహులు కేసీఆర్ కటాక్షం పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా పార్టీ వర్గాలకు అందాయి. ఇప్పటికే గ్రామ మండల స్థాయిల్లో పార్టీ కమిటీల ఎంపిక పూర్తయింది.

ఇక జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ మిగిలి ఉంది. అయితే జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపిక ద్వారా పార్టీలోని నేతల్లో విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు మిగిలింది రాష్ట్ర కమిటీ ఒక్కటే. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది.

మరో రెండు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. వాటి ఫలితాలు వెల్లడైన తర్వాత రాష్ట్ర కమిటీ ఎంపికపై కేసీఆర్ దృష్టి సారించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై ఆశపడి భంగపడ్డ ఆ పార్టీ నేతలు రాష్ట్ర కమిటీలోనైనా చోటు దక్కుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొంతమంది నేతలు కమిటీలో చోటు కోసం ప్రయత్నాలు కూడా మొదలెట్టారని టాక్. మరోవైపు ఈ కమిటీ కూర్పుపై కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని గతంలో కమిటీలో ఉండి యాక్టివ్‌గా పని చేయని వాళ్లను పక్కనపెడతారని తెలుస్తోంది.

పార్టీ పరంగా కీలకమైన రాష్ట్ర కమిటీ కూర్పుపై పార్టీ పెద్దల ఆలోచన ఏమై ఉంటుందన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసే వారిని మాత్రమే కమిటీలో ఎంపిక చేయాలని కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం.

అలాంటి నాయకులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పటికే కొందరు ముఖ్య నేతలకు అప్పగించినట్లు కూడా చర్చ కొనసాగుతోంది. ప్రత్యర్థి విమర్శలకు దీటుగా సమాధానం చెప్పి పార్టీ గళాన్ని బలంగా వినిపించగలిగే నాయకులనే కమిటీలోకి తీసుకుంటారని టాక్. ఈ నేతలకు కమిటీలో చోటు కల్పించడం ద్వారా భవిష్యత్‌పై భరోసా కూడా ఇచ్చినట్లు అవుతుందనేది గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచనగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.