Begin typing your search above and press return to search.

అసద్ చెప్పిన తాజా నిజం ఏమిటో తెలుసా?

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:38 AM GMT
అసద్ చెప్పిన తాజా నిజం ఏమిటో తెలుసా?
X
అద్భుతమైన నిజాన్ని చెప్పారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మజ్లిస్ అన్నంతనే ముస్లిం పార్టీగా అనుకుంటారు కానీ.. తమ పార్టీకి కులమతాలకు అతీతంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఎవరిదాకానో ఎందుకు? తాను ముస్లిం మైనారటీలతో పాటు బడుగు.. బలహీన వర్గాల ప్రజల గొంతుకగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు అసద్. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ కు నలుగురు ముస్లిమేతర కార్పొరేటర్లు ఉన్నారని.. గతంలో ముస్లిమేతరులను మేయర్లుగా నియమించినట్లుగా చెప్పారు. అంతేకాదు.. వికారాబాద్.. కోరుట్ల.. మంచిర్యాల.. రామగుండం లాంటి ప్రాంతాల్లో ముస్లిమేతరులు తమ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఇన్ని మాటలు చెప్పే అసద్.. ఈసారి ఎన్నికల్లో పాతబస్తీలో నాన్ స్టాప్ గా గెలిచే ఎమ్మెల్యే సీట్లలో ముస్లిమేతరుల్ని పార్టీ తరఫున బరిలోకి దింపుతారా? అన్నది ప్రశ్న.

అందరిని కాకున్నా.. ఇద్దరు.. ముగ్గురిని ముస్లిమేతరుల్ని తమకు పట్టున్న పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దింపి..ఎమ్మెల్యేల్ని చేస్తే.. మజ్లిస్ ముస్లిం పార్టీ ఎంతమాత్రం కాదని ఎవరైనా ఒప్పుకుంటారన్న మాట వినిపిస్తోంది. నోరు విప్పితే ఒక వర్గానికి చెందిన వారి గురించి మాత్రమే మాట్లాడే అసద్ అండ్ కోకు మతం అన్నది పెద్ద విషయం కాదనుకుంటే.. మరో పని కూడా చేయొచ్చు. ముస్లిమేతర అధినేతలు మైనార్టీ సమావేశాలకు వెళ్లినప్పుడు.. వారి మాదిరే వేషధారణకు మొహమాటపడరు. మతాలకు అతీతమని చెప్పే అసద్.. కాస్తంత బొట్టు పెట్టుకొని.. పంచె.. కట్టుకోగలరా? అలా చేసిన నాడు.. కులమతాలకు అతీతం మజ్లిస్ మాత్రమే కాదు.. అసద్ కూడా అని చెప్పొచ్చు. మరి.. ఆ పని చేయగలరా సాబ్?