Begin typing your search above and press return to search.

అసద్ వ్యతిరేకించాడు.. కేసీఆర్ ఊరుకుంటాడా?

By:  Tupaki Desk   |   12 July 2020 5:00 AM GMT
అసద్ వ్యతిరేకించాడు.. కేసీఆర్ ఊరుకుంటాడా?
X
మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ జాన్ జిగ్రీ దోస్త్ గా మారారు. డైరెక్టుగా ప్రగతి భవన్ కు బుల్లెట్ పై వచ్చే స్వేచ్ఛ అసద్ కు ఉంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కినప్పటి నుంచి ఆయనకు మద్దతుగా అసద్ రాజకీయం చేస్తున్నారు. ఆయన తమ్ముడు మాత్రం అప్పుడప్పుడు టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నా అసద్ మాత్రం ఎప్పుడూ వెనకేసుకొస్తున్నాడు. ప్రస్తుతం అసదుద్దీన్ ఒకరిని గురిపెట్టారు. వారిని దించేందుకు రెడీ అయ్యాడు. కేసీఆర్ కు ప్రతిపాదన పెడుతున్నాడు.

2017 నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా మహ్మద్ సలీం ఉన్నాడు. టీడీపీ హయాంలోనూ 2001-04 వరకు ఈయనే చైర్మన్. ఇప్పుడు సలీమ్ పై అసద్ లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కరోనా వేళ ఖననాలను పట్టించుకోలేదని... భూమి కేటాయించలేదని.. వక్ఫ్ బోర్డు తరుఫున చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అసద్ కు ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో సలీంను తొలిగించి సమర్థులైన మాజీ డీజీపీ ఏకే ఖాన్, మాలిక్ మొటాసిమ్ ఖాన్ పేర్లను అసద్ తెరపైకి తెచ్చాడు. సలీంను తీసేసి ఎవరికైనా సమర్థులకు పదవులు ఇవ్వాలని తాజాగా అసద్ బహిరంగంగా ట్వీట్ చేయడం కలకలం రేపింది. వక్ఫ్ భూముల రక్షణ, మసీదులు, వక్ఫ్ భవనాల నిర్మాణం, పర్యవేక్షణ హజ్ హౌజ్ మెయింటెనెన్స్ లలో సలీం పూర్తిగా విఫలమయ్యారని అసద్ ప్రధాన ఆరోపణ. సలీం సమర్థుడు కాడని.. ఆయనకు అనుభవం లేదని అసద్ విమర్శిస్తున్నాడు.

మరి జాన్ జిగ్రి దోస్త్ అయిన అసద్ కోరాక కేసీఆర్ ఊరుకుంటాడా? తొందరలోనే వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవీకాలం ముగియడంతో అసద్ కు దగ్గరైన వారికి ఈ పదవిని ఇవ్వడానికి రెడీ అవుతారని చర్చ జరుగుతోంది..