బాబోయ్ ఇదేం వార్నింగ్.. వ్యక్తిగత విమర్శలు చేస్తే దాడులు తప్పవట

Mon Jul 13 2020 16:40:45 GMT+0530 (IST)

Arvind attacked after he charges TRS MLAs with land grabbing

వరంగల్ లో అధికార టీఆర్ఎస్ నేతలకు.. విపక్ష బీజేపీ నేతల మధ్య మొదలైన ఘర్షణ అంతకంతకూ ముదురుతోంది. వరంగల్ ఎమ్మెల్యేలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేయటం.. ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరిపోవటమే కాదు.. కొత్త తరహా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వేళ.. ఈ రోజు(సోమవారం) మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.తమ పార్టీకి చెందిన ఎంపీ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై బీజేపీ కార్యకర్తలు మరింతగా చెలరేగిపోయారు. వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు ఆఫీసు మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ఈ వివాదం మరింతగా ముదిరింది.

ఇదిలా ఉంటే.. తాజాగా వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా సరే.. వారిపై దాడులు తప్పవన్నారు. ఎంపీ అరవింద్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది. రాజకీయాల్లో హుందాగా విమర్శలు చేసుకోవటం మానేసి చాలా కాలమే అయ్యింది.

దూకుడు రాజకీయాలు మొదలయ్యాక ఎవరికి వారు వారికి తోచినట్లుగా విమర్శలు చేయటం ఎక్కువైంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు హద్దులు దాటేస్తున్నాయి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలన్నవి సహజంగా మారిపోయాయి. ఇలాంటివేళ.. విమర్శలు చేస్తే దాడులు తప్పవని వ్యాఖ్యానించటం ఏ మాత్రం సరికాదంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారేలా చేస్తారని చెబుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య వార్నింగ్ లు మామూలే అయినా.. వ్యక్తిగత విమర్శలు చేస్తే దాడులు తప్పవన్న మాటపై విస్మయం వ్యక్తమవుతోంది.