కేజ్రీవాల్ సక్సెస్ అయినట్లేనా ?

Tue Jan 18 2022 13:24:53 GMT+0530 (IST)

Arvind Kejriwal Political Strategy

తన కొత్త ప్రయోగంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయినట్లే ఉన్నారు. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందో చెప్పమని పంజాబ్ జనాలకే అవకాశం ఇస్తున్నట్లు మూడు రోజుల క్రితం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. జనాలు తమ అభిప్రాయాలను చెప్పటం కోసం 78740 78740 మొబైల్ నెంబరును కూడా ప్రకటించారు.తమ అభిప్రాయాలు చెప్పటానికి జనాలకు కేజ్రీవాల్ 96 గంటలు గడువిచ్చారు. ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చినట్లే ఉంది చూస్తుంటే. తాజాగా పార్టీ వర్గాల ప్రకటన ప్రకారం 96 గంటల్లో 19 లక్షల మంది రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేయటంలో 19 లక్షల మంది తమ అభిప్రాయాలను చెప్పటమంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం సీఎంను ఎంపిక చేయాలంటే గెలిచిన ఎంఎల్ఏలు మాత్రమే ఎన్నుకుంటారు.

అయితే ఇలాంటి పద్దతికి కేజ్రీవాల్ స్వస్తిపలకాలని అనుకున్నారు. అందుకనే డైరెక్టుగా ప్రజల అభిప్రాయం మేరకు సీఎం అభ్యర్ధిని ప్రకటించాలని అనుకున్నారు. కేజ్రీవాల్ మంగళవారం మొహాలీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనాల స్పందన ఎలాగుందో ఎవరిపేరును ప్రతిపాదించారో ప్రకటించబోతున్నారు. 19 లక్షల్లో 6.5 లక్షల మంది వాట్సప్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. 2.5 లక్షల మంది వాయిస్ మెసేజ్ చేశారు. అలాగే మరో 8 లక్షల మంది వాయిస్ కాల్ ద్వారా పేరును సూచించారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆప్ ఎంపీ భగవంత్ సిగ్ మాన్ పేరునే ఎక్కువమంది చెప్పారట. మాన్ ఎంపీ మాత్రమే కాకుండా పంజాబ్ ఆప్ యూనిట్ కు అధ్యక్షుడు కూడా. మంచి పనితీరును కనబరుస్తున్నట్లు జనాల గుడ్ లుక్స్ లో ఉన్నారట. కాబట్టి బుధ గురువారాల్లో పంజాబ్ లోని మొత్తం 117 సీట్లకు ఒకేసారి కేజ్రీవాల్ అభ్యర్ధులను ప్రకటించబోతున్నారు. సో తాను అభ్యర్ధులను ప్రకటించేలోగానే జనాల అభిప్రాయం కూడా కనుక్కుని మెజారిటి అభిప్రాయం ప్రకారం సదరు అభ్యర్ధి పేరునే ప్రకటించాలన్నది కేజ్రీవాల్ భావన. మంచి ఉద్దేశ్యమే కానీ రేపటి ఎన్నికల్లో సదరు అభ్యర్ధి గెలవకపోతే ?