ఆర్మీ మేజర్ అంటూ 17 మంది అమ్మాయిలతో..రూ. 6 కోట్లు స్వాహా - ఆ తర్వాత ఏమైందంటే?

Sun Nov 22 2020 22:20:22 GMT+0530 (IST)

Army Major with 17 girls .... Rs. 6 crores

దొంగలకే దొంగ .. ఈ దొంగ. ఈ దొంగ తెలివి తేటలు చూస్తే ఎంతటి దొంగ అయినా కూడా వామ్మో అనాల్సిందే. చూడచక్కని అందం అంతకుమించిన ఉద్యోగం దీనితో నేరాలని చాలా సులువుగా చేస్తూ కోట్లకి కోట్లు కాజేశాడు. ఇంతకీ ఇతగాడు చేసే జాబ్ ఏంటి అంటే ఆర్మీ మేజర్. నిజంగా అనుకునేరు దొంగ ఆర్మీ మేజర్. అతని బండారం మొత్తం బయటపడటంతో తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని  వయసు 42 సంవత్సరాలు. చూడ్డానికి మాత్రం 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు.  ప్రకాశం జిల్లాలోని మండ్లమూరు మండలంలోని కెల్లంపల్లి గ్రామానికి చెందినవాడు. పెళ్లి పేరుతో మొత్తం 17 ఫ్యామిలీల నుంచి రూ.6.61 కోట్లు లాగేశాడు. మొత్తం 17 మంది అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఇతని నుంచి మూడు డమ్మీ పిస్టల్స్ మూడు జతల ఆర్మీ ఫ్యాటిగ్ ఓ నకిలీ ఆర్మీ ఐడీ కార్డు నకిలీ మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్ ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు కార్లు రూ.85000 క్యాష్ కూడా సీజ్ చేశారు. పేరు ముదావత్ శ్రీను నాయక్. నకిలీ పేరు కూడా ఉంది. అది శ్రీనివాస్ చౌహాన్.

చదివింది 9వ తరగతి వరకే. పీజీ చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. అమృతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఓ కొడుకును కన్నాడు. ఆ కుర్రాడి పేరు నిఖిల్ సింగ్ చౌహాన్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఫ్యామిలీ సభ్యులు ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉంటున్నారు. 2014లో శ్రీను నాయక్ హైదరాబాద్ వచ్చి సైనిక్ పురిలో సెటిల్ అయ్యాడు. తాను ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా జాబ్ సంపాదించుకున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వాళ్లు నిజమే అని నమ్మారని పోలీసులు తెలిపారు. నకిలీ ఆధార్ కార్డ్ సంపాదించాడు. దానిపై శ్రీనివాస్ చౌహాన్ అని పేరుంది. దానిపై నకిలీ డేట్ ఆఫ్ బర్త్ 27-08-1986 అని ఉంది. అసలు పుట్టిన తేదీ 12-07-1979. మ్యారేజ్ బ్యూరోలు స్నేహితుల ద్వారా... పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిల సమాచారం సేకరించేవాడు. తన నకిలీ ఆర్మీ ఐడీ కార్డు నకిలీ పిస్టల్స్ చూపించి... అమ్మాయిల ఫ్యామిలీలకు పరిచయం అయ్యేవాడు. పుణె లోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీ నుంచి డిగ్రీ చేసినట్లుగా చెప్పుకునేవాడు.

తెలంగాణ సెక్రటేరియట్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న ఓ పెద్దాయన.. మెడిసిన్ చదివిన తన కూతురికి శ్రీను నాయక్ తో పెళ్లిని ఖరారు చేశాడు. తీరా పెళ్లి పత్రికలు అచ్చయిన తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని శ్రీను తన ఖాతాలోకి రూ.56లక్షలు వేయించుకున్నాడు. వరంగల్ కు చెందిన ఓ కుటుంబం నుంచి ఏకంగా రూ.2 కోట్లు లాగేశాడు. హైదరాబాద్ కే చెందిన మయో యువతికి.. తాను ఖరగ్ పూర్ లో ఐఐటీ చేశానని బిల్డప్ ఇచ్చి దగ్గరయ్యాడు. కానీ ఆ అమ్మాయి.. ఐఐటీలో విచారించగా శ్రీను నాయక్ చెప్పింది అబద్ధమని తేలిపోయింది. దీంతో ఆమె అతణ్ని నిలదీసింది. అయినాసరే ఏమాత్రం భయపడకుండా మాయమాటలతో అమ్మాయిని నమ్మించాడు. శనివారం శ్రీను నాయక్ కారులో మరో అమ్మాయిని మోసం చేయడానికి వెళుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. తాను ఆర్మీ మేజర్ అని భార్యను కూడా నమ్మించిన ఈ కేటుగాడు.. ఇటీవలే ఆమె నుంచి రూ.65 లక్షలు తీసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ వివరించారు. ఆర్మీ మేజర్ అంటూ అమ్మాయిలని మోసం చేసిన ఈ కేటుగాడు ప్రస్తుతం జైలు గోడల మధ్య ఉన్నాడు.