మహిళా క్రికెటర్ తో క్రికెట్ దేవుడి కొడుకు.. వైరల్ గా ఫోటోలు

Wed Jun 29 2022 09:11:03 GMT+0530 (IST)

Arjun Tendulkar With Danier Wyatt Viral Pic

క్రికెట్ దేవుడిగా అభివర్ణించే సచిన్ టెండ్యూలర్ ఎంతటి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఫాలో అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మితభాషిగా.. అనవసరమైన విషయాల్లో అస్సలు కనిపించని ఆయన.. లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. తన సుదీర్ఘ కెరీర్ లో సచిన్ వ్యక్తిగత జీవితంలో ఆయన సతీమణితో సాగిన ప్రేమ.. పెళ్లి ఎపిసోడ్ మినహా మరెప్పుడూ.. ఆ విషయాలు వార్తలుగా మారింది లేదు.అందుకు భిన్నంగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ విషయంలో మాత్రం ఇప్పుడు కొత్త తరహా వార్తలు వస్తున్నాయి. వీటికి బలం చేకూరేలా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ఇంగ్లంగ్ క్రికెటర్ డేనియర్ వ్యాట్ తో అర్జున్ టెండూల్కర్ సన్నిహితంగా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. క్రికెట్ దేవుడు సచిన్ కు అత్యంత వీర ఫ్యాన్ అయిన వ్యాట్.. ఆయన కుమారుడితో సన్నిహితంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు.. 124 టీ20 మ్యాచ్ లు ఆడింది. ఆమె తన కెరీర్ మొత్తంలో 4 సెంచరీలు.. 12 హాఫ్ సెంచరీలతో 3400 పరుగులు సాధించటమే కాదు.. హాఫ్ స్పిన్నర్ అయిన ఆమె వన్డే.. టీ 20 ఫార్మాట్లలో కలిపి మొత్తం 73 వికెట్లు తీసింది.

కెరీర్ పరంగా వేలెత్తి చూపించలేని రీతిలో ఉన్న వ్యాట్.. సచిన్ ను విపరీతంగా అభిమానిస్తారు.. అంతకు మించి ఆరాధిస్తారు. సచిన్ లార్డ్స్ కు ఎప్పుడు వచ్చినా.. వ్యాట్ ఆయన్ను కలుస్తుందని చెబుతారు.

2009 నుంచి సచిన్.. అర్జున్ లతో తనకు పరిచయం ఉందని చెప్పే వ్యాట్.. అది కాస్తా మరింత ముందుకు వెళ్లిందన్న మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా అర్జున్.. వ్యాట్ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఆటకు సంబంధం లేని అంశంలో అర్జున్ వార్తాంశంగా మారారు. మరేం జరుగుతుందో చూడాలి.