అనర్హత పిటీషన్ పై మొదలైన వాదనలు

Tue May 24 2022 17:00:01 GMT+0530 (IST)

Arguments on disqualification petition

అధికార వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘరామకృష్ణంరాజు అనర్హత పిటిషన్ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ ముందు వాదనలు మొదలయ్యాయి. రఘురాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ 2020 జూలైలో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అప్పటినుండి ఏవేవో కారణాలతో పిటీషన్లో కదలిక లేకుండా అలాగే ఉండిపోయింది. రఘురాపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ ఎంత ప్రయత్నించినా ఇప్పటివరకు సాధ్యం కాలేదు. పిటిషన్ ఇచ్చిన 11 మాసాల తర్వాత పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఫిర్యాదు లేదని జాయింట్ సెక్రటరీ చెప్పారు.అంటే పిటిషన్ సరైన పద్ధతిలో లేదని చెప్పటానికే లోక్ సభ సెక్రటేరియట్ 11 నెలలు తీసుకుందంటేనే అర్థమవుతోంది తెర వెనకాల ఏమి జరుగుతోందో.

సరే జాయింట్ సెక్రటరీ చెప్పినట్లుగానే ఫిర్యాదును మళ్ళీ రెడీ చేసి వైసీపీ పిటీషన్ అందించింది. దాన్ని స్పీకర్ పరిశీలించి సభాహక్కుల ఉల్లంఘన కమిటికి పంపారు. ఇంతకాలం తర్వాత సోమవారం కమిటి సమావేశమయ్యింది. కమిటి ముందు లోక్ సభలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ వాదనలు వినిపించారు.
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నందుకు వెంటనే ఎంపీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాదని కమిటీ గుర్తించాలని చెప్పారు.

పార్టీ నిబంధనావళిని ఉల్లంఘిస్తున్నందుకు ఎంపీపై అనర్హత వేటు వేయాల్సిందే అని భరత్ కోరారు. ఒకపార్టీ తరపున ఎన్నికైన ఎంపీ మరోపార్టీ అజెండా ప్రకారం పనిచేస్తున్న కారణంగానే అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నట్లు భరత్ చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే అనర్హత పిటీషన్ పై వాదనలు వినడానికి కమిటికి ఇంతకాలం పట్టింది. ఇపుడు మొదలైన వాదనల పర్వంలో వైసీపీ వాదనలు విన్న కమిటీ తర్వాత ఎంపీ రఘురాజు వాదనలు కూడా వినాలి. అదెప్పుడు పూర్తవుతుందో తెలీదు. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత తన నివేదికను లోక్ సభ స్పీకర్ కు ఎప్పుడు అందిస్తుందో తెలీదు. దాని తర్వాత స్పీకర్ ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో. ఇదంతా అయ్యేసరికి పుణ్యకాలం గడచిపోవటం ఖాయం.